జనన నమోదు కాకముందే మరణ ధ్రువీకరణ పత్రాలు

May 14,2024 08:12 #child dies, #Gaza
  • గాజాలో ప్రతి 10 నిమిషాలకు ఒక బిడ్డ మృతి

రఫా : గాజాలో నేడు ఎటు చూసినా బాంబు దాడుల్లో చనిపోయిన తల్లుల సమాధులు, ఆ పక్కనే నవజాత శిశువుల సమాధులు వెలుస్తున్న హృదయవిదారక దృశ్యాలే. ఎవరిని కదిపినా కన్నీటి గాథలే. గాజాలో ఇజ్రాయిల్‌ ఇటీవల జరిపిన వైమానిక దాడిలో ఓ కుటుంబం యావత్తూ చనిపోయారు. మరణించిన తల్లి గర్భం నుండి నెలలు నిండకుండానే డెలివరీ అయిన పసికందు నబ్రీస్‌ ఉదంతం ఇజ్రాయిల్‌ అమానుషత్వానికి తిరుగులేని తార్కాణం. ఆ పసికందు తల్లి పాలకు నోచుకునే అవకాశం లేదు. బయటి పాలుపడదామంటే గాజాకు పాలు, నీరు, ఆహారం, మందుల సరఫరాను ఇజ్రాయిల్‌ పూర్తిగా అడ్డుకోవడంతో ఆ అవకాశమూ లేకపోయింది. దీంతో ఆ నవజాత శిశువు కొద్ది రోజులకే కన్నుమూసింది. ఆ శిశువు మృతదేహాన్ని తల్లి పక్కనే ఖననం చేశారు. గాజాలో మానవ హక్కులను ఇజ్రాయిల్‌ ఎంతగా కాలరాస్తున్నదో తెలుసుకోడానికి ఈ ఉదంతం ఒక మచ్చుతునక మాత్రమే. ఆసుపత్రులపై ఇజ్రాయిల్‌ హింసాత్మక దాడులకు తెగబడుతుండడం వల్ల ప్రసూతి వార్డులు పూర్తిగా నేలమట్టమయ్యాయి. దుర్భరమైన పరిస్థితుల్లో కాన్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనివల్ల మాతా, శిశు మరణాలు అసాధారణమైన రీతిలో పెరిగిపోయాయి.. అక్టోబర్‌ 7 నుండి ఇప్పటివరకు గాజాలో దాదాపు 20 లక్షల మంది పాలస్తీనియన్లను ఇళ్ల నుండి ఇజ్రాయిల్‌ బలవంతంగా తరిమేసినట్లు ఐక్యరాజ్యసమితి నివేదికలే చెబుతున్నాయి. బాంబు దాడుల్లో దాదాపు 62 శాతం ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఒక చోట నుంచి మరో చోటికి పాలస్తీనీయులను జాత్యహంకార నెతన్యాహు ప్రభుత్వం తరిమేస్తుండడంతో ఎలాంటి వసతులు లేని తాత్కాలిక గుడారాల్లో జీవనం సాగిస్తున్నారు. ప్రతి పది నిమిషాలకు ఒక బిడ్డ చనిపోతున్నారు. కొంతమంది నవజాత శిశువులు వారి జననాలను నమోదు చేయకముందే మరణ ధ్రువీకరణ పత్రం జారీ చేసే దౌర్భాగ్యకర పరిస్థితి నేడు అక్కడ నెలకొంది.

➡️