పాకిస్తాన్‌లో నేడు సార్వత్రిక ఎన్నికలు

Feb 8,2024 09:00 #elections, #Pakistan, #tomorrow

ఇస్లామాబాద్‌ : పాకిస్తాన్‌లో గురువారం సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. జాతీయ అసెంబ్లీకి 266 మంది ప్రతినిధులను నేరుగా ఎన్నుకోనున్నారు. వీటిలో 60 స్థానాలు మహిళలకు, 10 స్థానాలు ముస్లింయేతరులకు రిజర్వు చేశారు. దేశ వ్యాప్తంగా 90,582 పోలింగ్‌ కేంద్రాల్లో 12.8 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మొత్తం 5121 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. గత ఎన్నికల్లో విజేతగా నిలిచి అధికార పగ్గాలు చేపట్టిన ఇమ్రాన్‌ ఖాన్‌ జైల్లో బందీగా వున్న నేపథ్యంలో ఎన్నికలు జరుగుతుండటం విశేషం. అయితే, ఒక రాజకీయ పార్టీ స్థానంలో మరో పార్టీ వచ్చినంత మాత్రాన ప్రస్తుతం కొనసాగుతున్న సంక్షోభం సమసిపోదు. దేశం పూర్తిగా కోలుకోవాలంటే చాలా చర్యలు తీసుకోవాల్సి వుంది. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, పెట్టుబడుల సంక్షోభం, పెరుగుతున్న దారిద్య్రం, పెచ్చరిల్లుతున్న సామాజిక అసమానతలు ఇవన్నీ కలిసి ప్రజల సర్వతోముఖాభివృద్ధిని తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో జరుగుతున్న ఈ ఎన్నికల్లో పాకిస్తాన్‌ ముస్లిం లీగ్‌ నేత నవాజ్‌ షరీఫ్‌ యువతను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడే పక్షంలో గణనీయమైన ప్రభావాన్ని చూపగల జర్దారీ నేతృత్వంలోని పాకిస్తాన్‌ పీపుల్స్‌ పార్టీ కూడా భుట్టో రాజకీయ వారసత్వానికి పట్టు వున్న లార్కానాలో మకాం వేసింది. కాగా పాకిస్తాన్‌ తెహ్రీక్‌ ఇ ఇన్సాఫ్‌ (పిటిఐ) పరిస్థితి ఈ పార్టీలకు పూర్తి భిన్నంగా వుంది. తమ పార్టీ నేత ఇమ్రాన్‌ ఖాన్‌ జైల్లో మగ్గుతుండడంతో దిక్కుతోచని స్థితిలో వుంది.

➡️