పన్నూ హత్యకు రా మాజీ అధికారి విక్రమ్‌ కుట్ర

Apr 30,2024 01:53 #Gurpatwant Singh Pannun
  •  వాషింగ్టన్‌ పోస్ట్‌ వెల్లడి

న్యూఢిల్లీ : అమెరికా గడ్డపై ఖలిస్తాన్‌ అనుకూల ఉద్యమ నాయకుడు గుర్‌పత్వంత్‌ సింగ్‌ పన్నూ హత్యకు భారత ప్రభుత్వ అధికారి ఒకరు కుట్ర పన్నారని అమెరికా అధికారులు ఆరోపించిన వ్యక్తి పేరును వాషింగ్టన్‌ పోస్ట్‌ తన తాజా రిపోర్టులో వెల్లడించింది. పన్నూ హత్యకు కుట్ర పన్నింది రీసెర్చ్‌ అండ్‌ అనాలసిస్‌ వింగ్‌ (రా) మాజీ అధికారి విక్రమ్‌ యాదవ్‌ అని తెలిపింది. పన్నూ హత్యకు కుట్ర జరుగుతున్న సమయంలో రా చీఫ్‌గా ఉన్న సమంత్‌ గోయల్‌ తీవ్ర ఒత్తిడిలో ఉండేవారని కూడా వాషింగ్టన్‌ పోస్ట్‌ వెల్లడించింది. ‘విదేశాల్లో ఉన్న సిక్కు ఉగ్రవాదులను అంతం చేయాలని గోయల్‌పై తీవ్ర ఒత్తిడి ఉండేది’ అని పత్రిక తెలిపింది. విదేశాల్లో ఉన్న సిక్కు నాయకులను అంతం చేయడానికి రా చేస్తున్న కుట్రల గురించి జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌కు సమాచారం తెలిసే ఉంటుందని కూడా పత్రిక పేర్కొంది.
అమెరికా గడ్డపై పన్నూ హత్యకు ఒక గుర్తు తెలియని భారత ఆధికారి కుట్ర పన్నాడని గత ఏడాది నవంబర్‌లో అమెరికా ప్రాసిక్యూటర్లు పేర్కొన్నారు. వారి వాదనల ప్రకారం పన్నూను హత్య చేయడానికి ఒక కిల్లర్‌ను ఏర్పాటు చేసే బాధ్యతను విక్రమ్‌ యాదవ్‌కు అతనిపై అధికారులు అప్పగించారు. విదేశాల్లో ఉన్న సిక్కు నాయకులను అంతం చేయడానికి మోడీ ప్రభుత్వం ‘రా’ను ఒక ఆయుధంగా వినియోగించుకుందని వాషింగ్టన్‌ పోస్ట్‌ ఆరోపించింది. అమెరికా ప్రాసిక్యూటర్లు చేసిన ఆరోపణలపై విచారణ చేయడానికి ఒక ఉన్నతస్థాయి కమిటీని మోడీ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని అయితే కమిటీ కూర్పు, దాని దర్యాప్తు స్థితి గురించి ఎవరికీ తెలియదని వాషింగ్టన్‌ పోస్ట్‌ విమర్శించింది.

➡️