30,000 మందికి పైగా పాలస్తీనియన్లు మృతి : గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ

Feb 1,2024 08:20 #Gaza, #israel hamas war

 గాజా :    సుమారు ఐదు నెలలుగా గాజాపై ఇజ్రాయిల్‌ జరుపుతున్న అమానవీయ దాడులతో పాటు కరువు పరిస్థితుల కారణంగా   30,000 మందికి పైగా పాలస్తీనియన్లు మరణించారు. హమాస్‌ నేతృత్వంలోని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం ఈ వివరాలు ప్రకటించింది. గాజాస్ట్రిప్‌లో బుధవారం రాత్రి సుమారు 79 మంది మృతులతో కలిపి మొత్తం 30,000 మంది మరణించినట్లు వెల్లడించింది. ఈజిప్ట్‌, ఖతార్‌, అమెరికా మధ్యవర్తిత్వంతో కాల్పుల విరమణకు సంబంధించి ఇజ్రాయిల్‌, హమాస్‌ల మధ్య చర్చలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ముస్లింల పవిత్ర మాసం రంజాన్‌ నాటికి సంధి కుదరవచ్చని భావిస్తోంది.

గాజాలోని అల్‌-షిఫా ఆస్పత్రిలో పౌష్టికాహార లోపం, డిహైడ్రేషన్‌, కరువు కారణంగా చిన్నారులు మరణించారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధి అష్రఫ్‌ అల్‌ ఖుద్రా పేర్కొన్నారు. ఈ మరణాలను నివారించడానికి ‘తక్షణ చర్యలు’ చేపట్టాలని అంతర్జాతీయ సంస్థలకు పిలుపునిచ్చారు. ఇజ్రాయిల్‌ మరిన్ని సరిహద్దులను తెరవాల్సిన అవసరం ఉందని, దీంతో అవసరమైన మానవతా సాయం పెరగవచ్చని యుఎస్‌ఎఐడి అధ్యక్షుడు సమంతా పవర్‌ పేర్కొన్నారు. ‘ఇది జీవన్మరణ సమస్య’ గా మారిందంటూ గాజాలో క్షీణిస్తున్న పరిస్థితులపై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

➡️