గాజాలో తక్షణమే కాల్పుల విరమణ : అలీనోద్యమ దేశాల డిమాండ్‌

గాజా : గాజాపై ఇజ్రాయిల్‌ కొనసాగిస్తున్న దాడులను అలీనోద్యమ దేశాల నేతలు తీవ్రంగా ఖండించారు. తక్షణమే కాల్పుల విరమణ అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఉగాండా రాజధాని కంపాలాలో 120 సభ్య దేశాలతో కూడిన అలీనోద్యమ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ నెల 15న ప్రారంభమైన ఈ సమావేశాలు 20వ తేదీ వరకు కొనసాగుతాయి. ప్రతినిధుల సమావేశంలో క్యూబా ఉపాధ్యక్షుడు సాల్వడార్‌ వాల్డెస్‌ మెసా శుక్రవారం మాట్లాడుతూ, ”మేం ఎంతో నాగరికులమని చెప్పుకునే పశ్చిమ దేశాల నేతలు గాజాలో మహిళల, చిన్నారుల హత్యలను, ఆస్పత్రులు, పాఠశాలలపై విచక్షణారహిత బాంబు దాడులను, ప్రజలకు సురక్షితమైన తాగునీరు, ఆహారం అందకపోవడాన్ని ఏ విధంగా సమర్ధిస్తున్నారు?” అని ప్రశ్నించారు. ఆఫ్రికన్‌ యూనియన్‌ కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ మౌసా ఫాకీ మహమత్‌ మాట్లాడుతూ, పాలస్తీనియన్లపై సాగుతున్న ఈ అన్యాయమైన యుద్ధాన్ని తక్షణమే విరమించాలని పిలుపునిచ్చారు. ఆఫ్రికా దేశాల్లో దాదాపు సగం దేశాలు అలీనోద్యమంలో భాగంగా వున్నాయి. 1965లో ఏర్పడిన ఈ సంస్థ దక్షిణ సూడాన్‌కు తాజాగా సభ్యత్వం మంజూరు చేయనుంది. ఇదిలావుండగా, గాజాలో గత 24 గంటల్లో మొత్తంగా టెలికమ్యూనికేషన్‌ సంబంధాలు స్తంభించాయి. గాజాలోని వివిధ ప్రాంతాల్లో ఇజ్రాయిల్‌ దాడుల్లో డజన్ల సంఖ్యలో మరణించారు. ఈ దాడుల్లో తమవారు ఎవరైనా జీవించి వున్నారేమోనని కుటుంబ సభ్యులు శిథిóలాల్లో పడి వెతకడం కనిపిస్తోంది. ఇప్పటివరకు గాజాలో 24,762మంది మరణించగా, 62,108మంది గాయపడ్డారు. ఖాన్‌ యూనిస్‌లోని నాసర్‌ ఆస్పత్రిలో పరిస్థితులు భరించరానివిగా వున్నాయని అక్కడి డాక్టర్లు చెబుతున్నారు. ఇజ్రాయిల్‌కు మద్దతు ఆపండి : అమెరికాను కోరిన పాలస్తీనా అథారిటీఆక్రమిత ప్రాంతాల్లో ఇజ్రాయిల్‌ చేపడుతున్న దురాక్రమణ చర్యలను అమెరికా తక్షణమే ఆపాలని పాలస్తీనా అథారిటీ కోరింది. పాలస్తీనా అథారిటీకి సంస్కరణలు చేపట్టాలంటూ వాషింగ్టన్‌ కోరిందని వార్తలు వచ్చిన నేపథ్యంలో పాలస్తీనా డిప్యూటీ ప్రధాని నబిల్‌ అబూ రుదైనా మాట్లాడుతూ, అథారిటీలో ఏ మార్పు జరిగినా అది పాలస్తీనా ఎజెండాకు తగినట్లుగా వుంటుంది తప్ప విదేశాలు చెప్పినట్లు జరగదని అన్నారు. షరతులతో కూడిన కాల్పుల విరమణ ఇయు తీర్మానం బ్రసెల్స్‌: గాజాలో పాలస్తీనియన్లకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్‌ సాగిస్తున్న యుద్ధంలో శాశ్వత కాల్పుల విరమణకు పిలుపునిచ్చే తీర్మానాన్ని యూరోపియన్‌ యూనియన్‌ (ఇయు) పార్లమెంటు ఆమోదించింది, అయితే, ఈ కాల్పుల విరమణకు అది ఒక షరతు పెట్టింది. హమాస్‌ను పూర్తిగా తుడిచిపెట్టేయాలి, దాని వద్ద ఉన్న బందీలందరినీ విడుదల చేయాలన్నదే ఆ షరతు. గాజాలో ఇజ్రాయెల్‌ బాంబుదాడులకు ముగింపు పలకడానికి యూరపు దేశాలు ఇంతవరకు నిరాకరిస్తూ వస్తున్నాయి. ఈ తీర్మానానికి ఇయు కూటమిలోని దేశాలన్నీ బద్ధులై ఉంటాయని చెప్పలేం. కానీ ఇయు వైఖరిలో కొంత మార్పు వచ్చిందనడానికి ప్రతీకగా ఇది ఉంటుంది.

➡️