పాకిస్థాన్‌ ప్రధాని అభ్యర్థిపై వీడని సందిగ్థత ..! 

 ఇస్లామాబాద్‌ :    పాకిస్థాన్‌లో ఎన్నికల ఫలితాలు వెలువడి వారం రోజులు గడుస్తున్నప్పటికీ.. ఇంకా ప్రధాని అభ్యర్థిపై సందిగ్థత కొనసాగుతోంది. నవాజ్‌ షరీఫ్‌ పార్టీ పాకిస్థాన్‌ ముస్లిం లీగ్‌-నవాజ్‌ (పిఎంఎల్‌-ఎన్‌) షెహబాజ్‌ షరీఫ్‌ను కుర్చీపై కూర్చోబెట్టేందుకు సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే తమ ప్రధాని అభ్యర్థిగా ఉమర్‌ అయుబ్‌ ఖాన్‌ను నామినేట్‌ చేస్తున్నట్లు ఇమ్రాన్‌ ఖాన్‌ పార్టీ పాకిస్థాన్‌ తెహ్రీక్‌ ఇన్సాఫ్‌ (పిటిఐ) ప్రకటించింది. ఇమ్రాన్‌ ఖాన్‌ సహా పలువురు నేతలను జైలు నుండి బయటకు తీసుకురావడమే తమ మొదటి ప్రాధాన్యత అని స్పష్టం చేసింది.

పిటిఐ జనరల్‌ సెక్రటరీగా ఉన్న ఉమర్‌ అయుబ్‌ ఖాన్‌ మాజీ సైనిక నియంత అయుబ్‌ ఖాన్‌ మనవడు. ఖైబర్‌ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని హరిపూర్‌ నుండి పాకిస్థాన్‌ ముస్లీం లీగ్‌ -ఎన్‌ (పిఎంఎల్‌-ఎన్‌) అభ్యర్థిగా 2013 ఎన్నికలలో పోటీ చేసి ఓటమిపాలయ్యారు. అనంతరం 2018 సాధారణ ఎన్నికలకు ముందు పిటిఐలో చేరారు. ఇమ్రాన్‌ ఖాన్‌ పార్టీకి ఎన్నికల గుర్తు ప్రకటించకపోవడంతో.. పార్టీ నేతలు స్వతంత్య్ర అభ్యర్థులుగా బరిలోకి దిగారు. సుమారు 101 స్థానాలను పిటిఐ గెలుచుకుంది. నవాజ్‌ షరీఫ్‌ పార్టీ 75 సీట్లు గెలుచుకుని రెండో స్థానంలో నిలవగా, పాకిస్థాన్‌ పీపుల్స్‌ పార్టీ (పిపిపి) 54 సీట్లతో మూడోస్థానంలో ఉంది. అయితే పిఎంఎల్‌-ఎన్‌, పిపిపిలు సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాట చేసేందుకు సన్నహాలు చేస్తున్నాయి. ఇరు పార్టీల సంప్రదింపులు మరియు సమన్వయ కమిటీ (సిసిసిఎస్‌) చర్చలు జరుపుతోంది. ఇరు పక్షాలు శుక్రవారం మరోసారి చర్చలు జరపనున్నట్లు సంబంధిత వర్గాలు ప్రకటించాయి.

➡️