ఆస్ట్రేలియాలో భారత విద్యార్ధి హత్య

May 7,2024 00:20 #Australia, #Hatya

మెల్‌బోర్న్‌, చండీగఢ్‌ : ఆస్ట్రేలియాలో భారతీయ విద్యార్ధి ఒకరు కత్తిపోట్లకు గురై మరణించాడు. ఈ హత్యతో సంబంధ ముందని భావిస్తున్న మరో ఇద్దరు భారతీయుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఇంటి అద్దె విషయమై స్నేహితుల మధ్య తలెత్తిన గొడవ ఈ హత్యకు దారి తీసినట్లు తెలుస్తోంది. అయితే మృతుడు నవజీత్‌ సంథు(22)కు ఈ గొడవకు అసలు సంబంధం లేదు. వారిని ఘర్షణ పడవద్దని వారించినందుకే ఈ దాడి జరిగిందని తెలుస్తోంది. హర్యానాలోని కర్నాల్‌కి చెందిన నవజీత్‌ చదువు కోసం ఏడాదిన్నర క్రితం ఆస్ట్రేలియా వచ్చాడు. ఈ ఏడాది జులైలో శలవుల కోసం స్వదేశానికి రావాల్సి వుంది. ఈలోగానే ఇంత ఘోరం జరిగింది. వేరే చోటకు ఇల్లు మారదామనుకున్న నవజీత్‌ స్నేహితుడు (మరో భారతీయ విద్యార్ధి) తన సామాన్లతో కొత్త ఇంటికి తీసుకెళ్ళడానికి సాయం చేయాల్సిందిగా నవజీత్‌ను అడిగాడు. కారులో ఫ్రెండ్‌ను తీసుకెళ్ళడానికి వచ్చిన నవజీత్‌కు లోపల ఇంట్లో నుండి అరుపులు వినిపించడంతో లోపలకు వెళ్ళి అక్కడ ఘర్షణ పడుతున్న వారిని అడ్డుకోబోయాడు. వెంటనే ఛాతీలో తీవ్రంగా కత్త్తితో పొడవడం తో నవజీత్‌ చనిపోయాడని, అతడి స్నేహితుడు కూడా గాయపడ్డాడని నవజీత్‌ మావయ్య యశ్వీర్‌ తెలిపారు. ఆదివారం తెల్లవారు జామున తమకు సమాచారం అందిందని చెప్పారు. నిందితులు కూడా కర్నాల్‌కి చెందినవారేనని తెలిపారు.

➡️