కెనడాకు వెళ్లే భారతీయ విద్యార్థుల్లో 86 శాతం తగ్గుదల

Jan 17,2024 12:45 #Canada, #Indian student

ఒట్టావా :   దౌత్యపరమైన వివాదం కారణంగా కెనడాకు వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్య గణనీయంగా పడిపోయింది. భారతీయ విద్యార్థులకు సంఖ్యను కెనడా భారీగా తగ్గించినట్లు అధికారులు తెలిపారు. గతేడాది నాలుగవ త్రైమాసికంలో భారతీయ విద్యార్థులకు కెనడా జారీ చేసిన స్టడీ పర్మిట్ల సంఖ్య మూడవ త్రైమాసికంతో పోల్చితే ఏకంగా 86 శాతం తగ్గుదల నమోదయింది. గతేడాది డిసెంబర్‌లో కెనడా జారీ చేసిన స్టడీ పర్మిట్లను కేవలం 14,910 మందికి మాత్రమే అనుమతులిచ్చినట్లు కెనడా ఇమ్మిగ్రేషన్‌ మంత్రి మార్క్‌ మిల్లర్‌ ఓ ప్రకటనలో తెలిపారు. అంతకుముందు త్రైమాసికంలో ఆ సంఖ్య 1,08,940గా ఉంది. గతంతో పోలిస్తే ఆ సంఖ్య దాదాపు 86 శాతానికి పడిపోయినట్లు మార్క్‌ చెప్పారు. భారతీయులకు స్టడీ పర్మిట్‌ల సంఖ్య త్వరలో పుంజుకునే అవకాశం లేదని మంత్రి పేర్కొన్నారు.

.కెనడా ఇమ్మిగ్రేషన్‌ విభాగం ప్రకారం.. 2022లో కెనడా జారీ చేసిన స్టడీ పర్మిట్‌లలో భారతీయ విద్యార్థుల వాటా ఏకంగా 41 శాతంగా ఉంది. 2022లో 225,835 మంది భారతీయ విద్యార్థులకు స్టడీ పర్మిట్‌లు లభించాయి. అయితే ఖలిస్థాన్‌ ఉగ్రవాది హత్యతో కెనడా, భారత్‌ మధ్య ప్రస్తుతం తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న సంగతి తెలిసిందే. బ్రిటిష్‌ కొలంబియాలో ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్యలో భారతీయ ఏజెంట్ల వద్ద ఆధారాలు ఉన్నాయని కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో జూన్‌లో చెప్పడంతో దౌత్యపరమైన ఉద్రిక్తతలు చెలరేగాయి.

➡️