నేటి నుండి అమల్లోకి రానున్న ఇజ్రాయిల్‌ -హమాస్‌ ఒప్పందం

Nov 24,2023 13:07 #Gaza, #israel hamas war

గాజా స్ట్రిప్‌ : ఇజ్రాయిల్‌ -హమాస్‌ మధ్య యుద్ధంలో నాలుగు రోజుల ఒప్పదం శుక్రవారం ఉదయం నుండి అమల్లోకి రానున్నట్లు ఖతార్‌ తెలిపింది. బందీల మార్పిడి ఈ రోజు తర్వాత జరగవచ్చని పేర్కొంది. సుమారు ఏడు వారాల తీవ్రమైన దాడి తర్వాత నాలుగు రోజుల పాటు కాల్పుల విరమణకు ఇజ్రాయిల్‌- హమాస్‌ మధ్య ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. భారత కాలమానం ప్రకారం శుక్రవారం ఉదయం 10.30 గంటలకు కాల్పుల విరమణ అమల్లోకి రానుందని, సాయంత్రం 7.30 గంటల సమయానికి హమాస్‌ బందీలను విడుదల చేయవచ్చని ఖతార్‌ విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది.

మొదటి బ్యాచ్‌లో బందీల నుండి ఒకే కుటుంబానికి చెందిన 13 మంది మహిళలు, చిన్నారుల ఉండవచ్చని, నాలుగు రోజుల తర్వాత ఈ సంఖ్య 50కి చేరవచ్చని ఖతార్‌, అమెరికా పేర్కొన్నాయి. విడుదల చేయనున్న బందీల మొదటి జాబితా వచ్చిన తర్వాత బందీల కుటుంబాలతో సంప్రదింపులు జరుపుతామని ఇజ్రాయిల్‌ ప్రధాని బెంజిమన్‌ నెతన్యాహూ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.

ఇజ్రాయిల్‌ జైళ్లలో మగ్గుతున్న పాలస్తీనియన్లను కూడా విడుదల కానున్నట్లు ఖతార్‌ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మజేద్‌ అల్‌ అన్సారీ పేర్కొన్నారు. విడుదల చేయనున్న వారి జాబితా రూపొందిందని, అయితే ఎంతమందిని అన్న వివరాలు తెలియాల్సి వుందని వెల్లడించారు.

➡️