నాల్గవ విడతలో 33 మంది పాలస్తీనియన్లు విడుదల

Nov 28,2023 11:44 #Gaza, #israel hamas war

గాజా   :   ఇజ్రాయిల్‌ -హమాస్‌ మధ్య నాల్గవ విడత బందీల విడుదలో భాగంగా .. మంగళవారం తెల్లవారుజామున 33 మంది పాలస్తీనియన్లను జైళ్ల నుండి విడుదల చేసినట్లు ఇజ్రాయిల్‌ తెలిపింది. వీరంతా ఆక్రమిత వెస్ట్‌బ్యాంక్‌ నగరమైన రమల్లాకు తరలిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. 11 ఇజ్రాయిల్‌ బందీలను గాజాస్ట్రిప్‌ నుండి సోమవారం రాత్రి హమాస్‌ విడుదల చేసింది. ఆ 11 మందిలో మహిళలు, చిన్నారులు ఉన్నారు. నాలుగురోజుల కాల్పుల విరమణలో భాగంగా ఇప్పటివరకు సుమారు 240 మంది బందీలలో 62 మందిని విడుదల చేశారు.

ఇజ్రాయిల్‌ -హమాస్‌ మధ్య కాల్పుల విమరణ ఒప్పందాన్ని మరో రెండు రోజులు పొడిగించేందుకు ఒప్పందం కుదిరినట్లు ఖతార్‌ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి సోమవారం వెల్లడించిన సంగతి తెలిసిందే. ఖతార్‌, ఈజిప్ట్‌ ఈ ఒప్పందంలో మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్నాయి. అయితే శాశ్వత కాల్పుల విరమణకు అంగీకరించాలని అంతర్జాతీయ సమాజం ఒత్తిడి చేస్తోంది. ఇజ్రాయిల్‌ కొనసాగిస్తున్న అమానవీయ దాడిలో ఇప్పటి వరకు 14,854 మంది పాలస్తీనియన్లు మరణించగా, 37వేల మంది గాయపడ్డారు. మరో 6,800 మంది శిథిలాల కింద సమాధి కావడమో, చనిపోవడమో జరిగి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.

➡️