ముగ్గురు బందీలపై ఇజ్రాయిల్‌ సైన్యం కాల్పులు : దర్యాప్తు వివరాలు వెల్లడి

Dec 29,2023 12:38 #Gaza, #hostages, #Israel Army

 గాజా :    గాజాలో సహాయం కోసం విజ్ఞప్తి చేసిన ముగ్గురు బందీలను శత్రువులుగా పేర్కొంటూ సైన్యం కాల్చి చంపడంపై ఇజ్రాయిల్‌ గురువారం వివరణనిచ్చింది. ఉత్తర గాజాలోని షిజాయాప్రాంతంలో డిసెంబర్‌ 15న జరిగిన ఈ ఘటనపై ఇజ్రాయిల్‌ డిఫెన్స్ ఫోర్స్ (ఐడిఎఫ్)  విచారణ చేపట్టింది. ఈ ఘటనలో ఎలాంటి దురుద్దేశం లేదని, సైనికులు ఆ సమయంలో తమకున్న అవగాహన మేరకు సరైన చర్య చేపట్టారని తెలిపింది. ‘ప్రామాణిక ఆపరేటింగ్‌ విధానాలకు సైన్యం కట్టుబడి ఉందన్న   అంశాన్ని ఆర్మీ  చీఫ్‌ జనరల్‌ హెర్జి హలేవి ఉద్ఘాటించారని ఆ దర్యాప్తు పేర్కొంది.

గాజాలో ఇజ్రాయెల్‌ దాడులు జరుపుతున్న సమయంలో బిస్లమక్‌ బ్రిగేడ్‌ 17వ బెటాలియన్‌కు చెందిన సైనికుడు ముగ్గురు వ్యక్తులపై కాల్పులు జరిపాడు. వారిని హమాస్‌ సభ్యులుగా భ్రమించి అతడు దాడికి దిగాడు. ఆ కాల్పుల్లో ఇద్దరు మరణించగా.. మూడో వ్యక్తి సమీప భవనంలోకి పారిపోయాడు. వెంటనే కాల్పులు ఆపాలని అక్కడే ఉన్న కమాండర్‌ సైనికులను ఆదేశించాడు. అలాగే ఆ వ్యక్తి ఎవరనేది గుర్తించాలని చెప్పాడు.

ఆ తర్వాత కొద్దిసేపటికి ఆ భవనం నుంచి ‘సహాయం చేయండి. వారు నాపై కాల్పులు చేస్తున్నారు’ అని హిబ్రూ భాషలో అరుపులు వినిపించాయి. దాంతో కాల్పులు నిలిపేయాలని కమాండర్‌ మరోసారి ఆదేశాలు జారీ చేశాడు. ఆ తర్వాత మూడో వ్యక్తి భవనం నుంచి బయటకు వచ్చాడు. సైన్యం దిశగా వచ్చే ప్రయత్నం చేశాడు. పక్కన ట్యాంక్‌ నుంచి శబ్ధం  వస్తుండటంతో కమాండర్‌ ఆదేశాలు సైనికులకు వినిపించలేదు. దాంతో అక్కడున్న ఇద్దరు సైనికులు ఆ మూడో బందీపై కాల్పులు జరిపారని  ఐడిఎఫ్  తెలిపింది. ఆ ముగ్గురు బందీల ఒంటిపై చొక్కాలు లేవు. బలగాలకు దగ్గరగా వస్తున్నప్పుడు వారిలో ఒకరు తెల్ల జెండాను ఊపారు.  బలగాలకు వారు సరిగా కనిపించకపోవడమే కాల్పులకు దారితీసిందని తెలిపింది. అయితే ప్రామాణిక విధానాలకు సైన్యం కట్టుబడి  ఉందని ఆర్మీ చీఫ్ పేర్కొనడం గమనార్హం.

➡️