గాజాలో ఆగని ఇజ్రాయిల్‌ మారణకాండ

Feb 7,2024 11:12 #carnage, #Gaza, #Israel, #non-stop
  • తాజా దాడుల్లో 107మంది మృతి

గాజా : గాజాలో ఇజ్రాయిల్‌ విధ్వంసకాండ కొనసాగుతునే వుంది. శనివారానికి గడిచిన 24 గంటల్లో ఇజ్రాయిల్‌ జరిపిన దాడుల్లో 107 మంది పాలస్తీనియన్లు మరణించారు. గాజాలో మూడు వంతుల ప్రాంతాల నుండి ప్రజలను బలవంతంగా ఖాళీ చేయించిన ఇజ్రాయిల్‌ సైన్యం ఇప్పుడు రఫా నగరంపై దృష్టి సారించింది. ఇంతవరకు సేఫ్‌ జోన్‌గా పరిగణించిన దక్షిణ రఫాపై సైనిక దాడులను ఇజ్రాయిల్‌ అధికారులు సమీక్షిస్తున్నారు. ఇక అక్కడ సైనిక చర్యలు ప్రారంభించడానికి ముందుగా రఫా నుండి ప్రజలు ఖాళీ చేయాల్సిందేనని, సైన్యం తదుపరి లక్ష్యం రఫానే అని ఇజ్రాయిల్‌ రక్షణ మంత్రిని ఉటంకిస్తూ మీడియా పేర్కొంది. గత వారం రోజుల్లో దాదాపు 2లక్షల మంది పాలస్తీనియన్లు ఖాన్‌ యూనిస్‌ నగరం నుండి రఫాకు పారిపోయారు. దాంతో రఫా నగరం జనంతో కిక్కిరిసిపోయింది. నిర్వాసితులైన వీరందరూ ఈజిప్ట్‌ సరిహద్దు గోడకు పక్కనే శిబిరాలు వేసుకున్నారు. ఇక్కడ ఎలాంటి సేవలు అందడం లేదని, ఆహారం లేదని, కేవలం నీరు మాత్రమే అది కూడా ఈజిప్ట్‌ వాటర్‌లైన్‌ ద్వారా అందుబాటులో వుందని శరణార్ధిగా వచ్చిన హనీన్‌ చెప్పారు. తుపాకీ గురిపెట్టి మరీ బెదిరించడంతో తామందరం వారం రోజుల క్రితమే ఇక్కడకు చేరుకున్నామని చెప్పారు. ఉత్తర గాజాలో చోటు చేసుకున్న విధ్వంసం స్థాయిని పరిశీలించిన యుఎన్‌ఆర్‌డబ్ల్యుఎ (పాలస్తీనా శరణార్ధులకు సహాయమందించే ఐక్యరాజ్య సమితి సంస్థ), ఇక అక్కడ మిగిలిందేమీ లేదని వ్యాఖ్యానించింది. గాజాలోకి సాయం అందకుండా ఇజ్రాయిల్‌ మితవాద ఆందోళనకారులు అడ్డుకుంటున్నారని, వారాల తరబడి ఈ పరిస్థితి కొనసాగుతోందని తెలిపింది. ఇజ్రాయిల్‌ దాడులకు లక్ష్యంగా మారిన ఖాన్‌ యూనిస్‌ నగరంలోని నాజర్‌ ఆస్పత్రిలో వైద్య సిబ్బంది, రోగులు, తలదాచుకున్న నిర్వాసితులు ఆహారం లేకుండా రోజులు వెళ్లదీస్తున్నారు. ప్రస్తుతం ఆ ఆస్పత్రిలో 300 మంది వైద్య సిబ్బంది, 450 మంది క్షతగాత్రులు, పదివేల మందికి పైగా నిర్వాసితులు వున్నారు. ఇంధన కొరతతో మరో నాలుగు రోజుల్లో విద్యుత్‌ కూడా నిలిచిపోనుంది. ఆస్పత్రిని, దాని పరిసర ప్రాంతాలను సైన్యం దిగ్బంధనం చేసింది. ఇప్పటివరకు గాజాపై దాడుల్లో 27,585 మంది పాలస్తీనియన్లు మరణించగా, 66,978 మంది గాయపడ్డారని పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి.

➡️