దక్షిణ కొరియాలో జూనియర్‌ డాక్టర్ల సమ్మె ఉదృతం

సియోల్‌ : ప్రభుత్వ వైద్య విధానానికి వ్యతిరేకంగా దక్షిణ కొరియాలో గత కొన్ని రోజులుగా సాగుతున్న జూనియర్‌ డాక్టర్ల సమ్మె మరింత ఉధృత రూపం దాల్చింది. సమ్మెను విరమించి వెంటనే విధుల్లో చేరాలని, లేకుంటే మూడేళ్లు జైలు శిక్ష, మూడు కోట్ల వోన్‌లు (18వేల పౌన్లు) జరిమానా విధించాల్సి వస్తుందని ప్రభుత్వం బెదిరించింది. అయితే ఈ బెదిరింపులను లెక్క చేయకుండా ప్రభుత్వం తన విధానాన్ని వెనక్కి తీసుకునేంతవరకు తమ పోరాటం ఆగదని జూనియర్‌ డాక్టర్లు తేల్చి చెప్పారు. 13వేల మంది సమ్మెలో ఉండగా, మరో 8వేల మంది ఉద్యోగాలకు దూరంగా ఉన్నారు. లక్షా నలబై వేల మంది డాక్టర్లతో కూడిన కొరియా మెడికల్‌ అసోసియేషన్‌ జూనియర్‌ డాక్టర్ల సమ్మెకు మద్దతు ప్రకటించింది. అయితే, సమ్మెలోకి ఇంకా దిగలేదు. జూనియర్‌ డాక్టర్ల సమ్మెతో దేశ వ్యాపితంగా వైద్య సేవలు స్తంభించాయి. వేలాది ఆపరేషన్లు నిలిచిపోయాయి. వైద్యుల కొరత తీవ్రంగా ఉండడంతో వేతనాలు ఎక్కువ డిమాండ్‌ చేస్తున్నారంటూ ప్రభుత్వం ఎక్కువ మంది వైద్య విద్యార్థులను రిక్రూట్‌ చేసుకోవాలని యోచిస్తోంది. మెడికల్‌ కాలేజీలకు సరైన మౌలిక సదుపాయాలు కల్పించకుండా, అవసరమైన నిధులు కేటాయించకుండా ప్రభుత్వం సీట్లు పెంచడం వల్ల వైద్య విద్యలో నాణ్యత పడిపోతుందని జూనియర్‌ డాక్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే ప్రభుత్వ వైద్య విద్య విధానం లోపభూయిష్టంగా ఉందని, దీనిని మార్చాలని వారు కోరుతున్నారు.

➡️