ఆస్ట్రేలియా చేరుకున్న అసాంజె

Jun 26,2024 23:57 #arrived, #Assange, #Australia

గూఢచర్య చట్టాన్ని ఉల్లంఘించడం నేరమేనని అంగీకారం
మెల్‌బోర్న్‌ : వికీలీక్స్‌ వ్యవస్థాపకుడు జూలియన్‌ అసాంజె బుధవారం తన మాతృదేశమైన ఆస్ట్రేలియా చేరుకున్నారు. అమెరికా గూఛర్య చట్టాన్ని ఉల్లంఘించడం నేరమేనని అంగీకరించడంతో అమెరికా ప్రభుత్వం ఈ కేసు మూసివేసింది. అమెరికా భూభాగమైన సైపన్‌లో మూడు గంటల పాటు అసాంజెను విచారించారు. జాతీయ రక్షణ పత్రాలను సంపాదించి, వాటిని బహిర్గతం చేయడమే నేరమేనని అయితే అమెరికా రాజ్యాంగంలోని మొదటి సవరణను తాను విశ్వసిస్తానని ఆయన చెప్పారు. భావ ప్రకటనా స్వేచ్ఛను ఈ సవరణ పరిరక్షిస్తోంది. జర్నలిస్టుగా తనకు సమాచారం అందించే వర్గాలు, వనరులను తానెప్పుడూ ప్రోత్సహిస్తానని ఈ కార్యకలాపాలను మొదటి సవరణ పరిరక్షిస్తోందని భావిస్తున్నట్లు అసాంజె చెప్పారు. అయితే గూఢచర్య చట్టాన్ని ఉల్లంఘించడం నేరమేనని అంగీకరించారు. అసాంజె చర్యల వల్ల వ్యక్తిగత బాధితులెవరూ లేరని అమెరికా ప్రభుత్వం కూడా స్పష్టం చేసిందని చీఫ్‌ యుఎస్‌ డిస్ట్రిక్ట్‌ జడ్జి రామొనా వి.మంగ్లోనా పేర్కొన్నారు.
అంతర్జాతీయ జర్నలిజానికి లభించిన విజయమిది
అసాంజె విడుదలపై అంతర్జాతీయ జర్నలిస్టుల సమాఖ్య అధ్యక్షుడు డొమినిక్‌ వ్యాఖ్య
వికీలీక్స్‌ వ్యవస్థాపకుడు జూలియన్‌ అసాంజె విడుదలైన నేపథ్యంలో ఇది సమాచార హక్కుకు లభించిన విజయమని అంతర్జాతీయ జర్నలిస్టుల సమాఖ్య అధ్యక్షుడు డొమినిక్‌ ప్రదలీ వ్యాఖ్యానించారు. ప్రపంచవ్యాప్తంగా వున్న జర్నలిస్టు మిత్రులకు లభించిన విజయమిదని అన్నారు.
రిపోర్టర్స్‌ వితౌట్‌ బోర్డర్స్‌ డైరెక్టర్‌ రెబెకా విన్సెంట్‌ స్పందిస్తూ, జర్నలిజానికి, పత్రికా స్వేచ్ఛకు సుదీర్ఘకాలం తర్వాత వచ్చిన విజయమని అన్నారు. దేశ భద్రతా వ్యవహారాలపై రిపోర్టింగ్‌తో లక్ష్యంగా మారిన జర్నలిస్టులందరికీ మద్దతుగా తాము ప్రచారాన్ని సాగించనున్నట్లు తెలిపారు. మరోసారి జర్నలిస్టులెవరినీ ఇలా లక్ష్యంగా చేసుకోకుండా వుండేందుకు అమెరికా గూఢచర్య చట్టాన్ని సంస్కరించాలని తాము ప్రచారం చేపడతామన్నారు. అసాంజె కేసు ప్రజల దృష్టిలో పడేలా, న్యాయం జరిగేందుకు పోరు సాగిస్తూ అవిశ్రాంతంగా కృషి చేసిన వారి వల్లే ఈ పోరాటం విజయవంతమైందని స్టాప్‌ ది వార్‌ జాతీయ అధికారి జాన్‌ రీస్‌ వ్యాఖ్యానించారు. ఆ పోరాటాలే ఈ స్థాయిలో లేకపోతే అసాంజె అమెరికాలోని జైల్లోనే ఎవరికీ తెలియకుండా సమాధి అయిపోయేవాడని అన్నారు. ఎన్నికల వే ళ బైడెన్‌ లేదా ట్రంప్‌లు ఈ విషయంలో రభస చేయకూడదని భావించాయని అన్నారు.
కింది స్థాయిలోని నిర్వాహకులు, పత్రికా స్వేచ్ఛ కోసం పోరు సల్పేవారు, చట్టసభల సభ్యులు, నేతలు ఇలా ప్రతి ఒక్కరూ ప్రపంచవ్యాప్తంగా సాగించిన పోరాటాలు, ప్రచారాల వల్లనే ఈ విజయం సాధ్యమైందని వికీలీక్స్‌ ఎక్స్‌లో పేర్కొంది. ఆసాంజె ఆస్ట్రేలియాకు చేరుకున్న నేపథ్యంలో తము అండగా నిలబడిన, తమకోసం పోరాడిన వారందరికీ కృతజ్ఞతలు తెలియచేస్తున్నట్లు ఆ పోస్టు పేర్కొంది. అసాంజె స్వేచ్ఛ అంటే మన స్వేచ్ఛే అని వ్యాఖ్యానించింది.

➡️