Australia : సిడ్నీ షాపింగ్‌ మాల్‌లో కత్తి పోట్లు

ఆరుగురు మృతి, పలువురికి గాయాలు
సిడ్నీ : ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో రద్దీగా వుండే షాపింగ్‌ సెంటర్‌లో ఒక దుండగుడి కత్తిపోట్లకు గురై ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయపడ్డారు. నిందితుడిని పోలీసులు కాల్చిచంపారు. న్యూ సౌత్‌వేల్స్‌ పోలీసు అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆంథోనీ కూక్‌ శనివారం పత్రికా సమావేశంలో వివరాలు వెల్లడించారు. గాయపడిన వారిలో తొమ్మిది నెలల బిడ్డ, ఆమె తల్లి కూడా వున్నారని, మొత్తంగా ఎనిమిది మందిని ఆస్పత్రికి తరలించి చికిత్సనందించామని చెప్పారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా వుంది. దాడి జరిగిన సమయంలో ప్రజలతో షాపింగ్‌ సెంటర్‌ రద్దీగా వుందన్నారు. వెంటనే ఆ ప్రాంతాన్నంతటినీ తమ అదుపులోకి తీసుకున్న పోలీసులు వందలాదిమందిని సంఘటనా స్థలం నుండి ఖాళీ చేయించారు. ఘటనపై దర్యాప్తునకు ఆదేశించామని వివరాలు తెలియగానే అవసరమైన చర్యలు తీసుకుంటామని ఆస్ట్రేలియా ప్రధాని ఆంథతోనీ అల్బనీస్‌ చెప్పారు. ప్రాధమిక సమాచారం ప్రకారం ఈ వ్యక్తి ఒక్కడే కత్తితో దాడి చేసినట్లు తెలుస్తోందని, అందువల్ల ఎలాంటి ముప్పు వుందనుకోవడం లేదని తెలిపారు.

➡️