జాతి ఉన్మాదానికి వ్యతిరేకంగా జర్మనీలో భారీ ర్యాలీలు

Jan 24,2024 11:13 #jermany
  • మితవాద పార్టీలపై నిషేధం విధించాలని నినదించిన ప్రదర్శకులు

లీప్‌జిగ్‌ : మితవాద పార్టీ జాతి ఉన్మాద చర్యలకు నిరసనగా జర్మనీలోని లీప్‌జిగ్‌లో ఇటీవల భారీ ప్రదర్శన నిర్వహించారు. రాజకీయ నాయకులు, మాజీ మంత్రులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు దీనికి మద్దతు తెలిపారు. జర్మనీలోని మిగతా పట్టణాలకు కూడా నిరసనలు వ్యాపించాయి. నియో నాజీలంతా ఒక చోట చేరి దేశం నుంచి వలసవాసులను తరిమేసే విషయమై చర్చించినట్లు వార్తా కథనాలు వెలువడ్డాయి. ఈ నియోనాజీల సమావేశానికి జర్మన్‌ మితవాద పార్టీ ఎఎఫ్‌డి సభ్యులు కూడా పాల్గొన్నట్లు ఆ కథనాలు పేర్కొన్నాయి. శరణార్థులను సామూహికంగా గెంటివేయడం పై ఈ సమావేశం కేంద్రీకరించినట్లు జర్నలిజం నెట్‌వర్కు కరెక్టివ్‌ ఓ కథనాన్ని ప్రచురించింది. ఈ వార్తలు జర్మన్‌ పౌరులను షాక్‌కు గురి చేశాయి. వలసవాదులను ద్వేషించే మితవాద పార్టీలను నిషేధించాలని వారు నినదించారు. జర్మనీలో యూరోపియనేతరులు, శ్వేతేతరులు గణనీయ సంఖ్యలో ఉన్నారు. అసహనం, జాత్యహంకారాన్ని ఎట్టి పరిస్థితుల్లోను అనుమతించేది లేదని యువకులు వీధుల్లోకి వచ్చి నినదించారు. బెర్లిన్‌లో జరిగిన నిరసనలో సుమారు 100,000 మంది ప్రజలు పాల్గొన్నారు. పశ్చిమ నగరమైన కొలోన్‌లో జరిగిన ప్రదర్శనలో 70,000 మంది ప్రజలు కూడా పాల్గొన్నారు. శుక్రవారం హాంబర్గ్‌లో మరియు శనివారం స్టుట్‌గార్ట్‌ మరియు నురేమ్‌బెర్గ్‌లో భారీ ప్రదర్శనలు జరిగాయి. గతానికి భిన్నంగా, జర్మనీలోని చిన్న పట్టణాలు కూడా తీవ్రవాద పార్టీలకు వ్యతిరేకంగా పోరాటాలతో బాధపడుతున్నాయి.

➡️