యుద్ధం విస్తరించే ప్రమాదం ఉంది: అమెరికా విదేశాంగ మంత్రి

వాషింగ్టన్‌ :    గాజాపై ఇజ్రాయిల్‌ దాడి విస్తరించే ప్రమాదం ఉందని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ హెచ్చరించారు. ఇది మధ్యప్రాచ్యం భద్రతకు ముప్పు కలిగించవచ్చని అన్నారు. ప్రస్తుతం ఆప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొందని వెల్లడించారు. ఈ సంఘర్షణ ఇతర ప్రాంతాలకు వ్యాపించవచ్చని, ఇది మరింత అభద్రతతకు, ఆందోళనకు గురిచేయవచ్చని అన్నారు. ఆదివారం ఆయన ఖతార్‌ ప్రధాని షేక్‌ మొహమ్మద్‌ బిన్‌ అబ్దుల్‌ రహమాన్‌తో కలిసి దోహాలో మీడియాతో మాట్లాడారు. ఇజ్రాయిల్‌ పౌరులను రక్షించడం కోసం ఇది అత్యవసరమని అన్నారు. పౌరుల రక్షణ కోసం, ప్రజలకు అవసరమైన మానవతా సాయం పొందేందుకు వీలుగా కార్యకలాపాలు రూపొందించేలా చూసుకోవాలని హెచ్చరించారు. గాజాలో తీవ్రమవుతున్న మానవతా సంక్షోభం మరియు నిరాశ్రయులవుతున్న సంగతి తెలిసిందే. పరిస్థితులు అనుమతించిన వెంటనే వారి ప్రాంతాలకు తిరిగి రావాలని అన్నారు.

గాజాలో ఇద్దరు అల్‌జజీరా జర్నలిస్టుల మృతి ఊహించలేని విషాదమని బ్లింకెన్‌ పేర్కొన్నారు. పలువురు అమాయక పాలస్తీనియన్ల విషయంలోనూ అదే జరిగిందని అన్నారు. గాజాలో తాజా సంధిపై అమెరికా మద్దతుతో హమాస్‌తో చర్చలు కొనసాగుతున్నాయని ఖతార్‌ ప్రధాని చెప్పారు. కాగా, జోర్డాన్‌, టర్కీ, గ్రీస్‌ల మీదుగా బ్లింకెన్‌ ఖతార్‌ చేరుకున్నారు. సోమవారం సౌదీ అరేబియాకు చేరుకోనున్నారు. సౌదీ ప్రిన్స్‌ మహ్మద్‌ బిన్‌ సల్మాన్‌తో బ్లింకెన్‌ సమావేశమవుతారని యుఎస్‌ అధికారి ఒకరు తెలిపారు.

➡️