ఇజ్రాయెల్‌ దాడుల వల్ల గాజాలో 25 వేల మందికిపైగా మృతి

Jan 23,2024 09:05 #Gaza, #israel hamas war

గాజా : ఇజ్రాయిల్‌ గత మూడున్నర నెలలుగా తీవ్ర స్థాయిలో దాడులకు పాల్పడుతుండటంతో పాలస్తీనా పరిస్థితి హృదయవిదారకంగా మారింది. గతేడాది అక్టోబర్‌ 7వ తేదీన ప్రారంభమైన ఈ యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇజ్రాయెల్‌ దాడుల వల్ల ఇప్పటివరకు 25, 105 మంది మృతి చెందారు. గత 24 గంటల్లో 178 మంది పాలస్తీనియన్లు మృతి చెందారని పాలస్తీనా ఆరోగ్యమంత్రిత్వశాఖ ప్రతినిధి అష్రఫ్‌ అల్‌ఖుద్రా ఆదివారం తెలిపారు. వేలాది మంది మృతి చెందడానికి కారణమైన ఇజ్రాయెల్‌ చర్యలను ఐక్యరాజ్యసమితి జనరల్‌ సెక్రటరీ ఆంటోనియా గుటెరస్‌ తీవ్రంగా ఖండిం చారు. ఉగాండా రాజధాని కంపాలాలో జి77 ప్లస్‌ చైనా సమ్మిట్‌ సమావేశాలు సందర్భంగా గుటెరస్‌ అల్‌జజీరాతో మాట్లాడుతూ.. ‘నేను యుఎన్‌ సెక్రటరీ జనరల్‌గా ఉన్న సమయంలో ఇజ్రాయెల్‌ సైనిక కార్యకలాపాలు, సామూహిక విధ్వంసం, పౌరుల మరణాలు ఊహించని స్థాయిలో పెరిగాయి. ఇజ్రాయెల్‌ చర్యల్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. కేవలం రెండు మార్గాలే ఈ సమస్యకు పరిష్కారం. ఒకటి, పాలస్తీనియన్ల రాజ్యాధికార హక్కును అంగీకరించడం. రెండోది రెండు రాష్ట్రాల ఏర్పాటుకు అంగీకరించడం. వీటిద్వారానే దశాబ్దాల తరబడి కొనసాగు తున్న ఈ సమస్యకు మార్గాలు.’ అని ఆయన అన్నారు.

ఇజ్రాయిల్‌ పార్లమెంటరీ కమిటీసమావేశాన్ని చుట్టుముట్టిన బందీల కుటుంబాలు

జెరూసలేం : హమస్‌ నిర్బంధించిన తమ కుటుంబ సభ్యులను తక్షణమే విడిపించేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ బందీల కుటుంబ సభ్యులు జెరూసలేంలో పార్లమెంటరీ కమిటీ సమావేశాలను చుట్టుముట్టారు. దాదాపు 20మంది బంధువుల బృందం సోమవారం ఈ చర్యకు దిగింది. ‘అక్కడ వారు చనిపోతుంటే ఇక్కడ మీరు ఇక్కడ కూర్చోవడానికి కుదరదు’ అంటూ వారు నినదించారు. వెంటనే వారిని విడిపించాలని డిమాండ్‌ చేశారు. గాజాలో యుద్ధం ఆరంభించి నాలుగు మాసాలవుతున్నా పాలస్తీనా గ్రూపుతో ఒప్పందం కుదుర్చుకోవడానికి ఇజ్రాయిల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు తిరస్కరించడంపై వారు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. బందీలుగా వున్న తమవారి ఫోటో ప్లకార్డులను పట్టుకుని వారు నిరసనకు దిగారు. మొత్తంగా 253మందిని బందీలుగా పట్టుకోగా నవంబరులో వారం రోజుల పాటు సాగిన కాల్పుల విరమణ సందర్భంగా దాదాపు వందమందిని విడిచిపెట్టారు. ఇంకా 130మంది గాజాలోనే బందీలుగా వున్నారు.

➡️