రఫాపై దాడికి రంకెలేస్తున్న నెతన్యాహు

May 1,2024 00:18 #death, #gaja, #kid death
  •  వచ్చే వారం ఇజ్రాయిల్‌లో బ్లింకెన్‌ పర్యటన
  •  గాజాపై తాజా దాడుల్లో 60మంది మృతి
  •  బీజింగ్‌ వేదికగా పాలస్తీనా గ్రూపుల మధ్య సయోధ్యకు యత్నం

గాజా : గత ఏడు మాసాలుగా 34వేలమందికిపైగా పాలస్తీనీయులను ఊచకోత కోసిన నర రూప రాక్షసుడు నెతన్యాహు రక్తదాహం ఇంకా తీరలేదు. వందల వేల సంఖ్యలో పాలస్తీనియన్లు తల దాచుకున్న రఫా నగరంపై ఇప్పటికే వైమానిక దాడులతో విరుచుకుపడుతున్న నెతన్యాహు ఇప్పుడు భూతల దాడులకు రంకెలు వేస్తున్నారు. పాలస్తీనీయులపై మారణకాండను ఆపాలని అమెరికాతో సహా ప్రపంచ వ్యాపితంగా విద్యార్థులు, ప్రొఫెసర్లు, ఉపాధ్యాయేతర సిబ్బంది కేంపస్‌లలో గుడారాలు వేసుకుని ఆందోళన చేస్తుంటే, వాటిని లెక్కచేయకుండా రఫాను నెత్తుటేరుల్లో ముంచేందుకు నెతన్యాహు బరితెగిస్తున్నారు. రఫాపై భూతల దాడులకు దిగొద్దని మిత్రపక్షమైన అమెరికా పైకి చెబుతూ, లోపలి నుంచి దాడికి అవసరమైన నిదులు, ఆయుధాలను అందిస్తున్నది. ఇంకో వైపు గాజాలో కాల్పుల విరమణ ఒప్పందం కోసం ఇరు పక్షాల మధ్య చర్చలు జరుపుతున్నాయి. అయితే చర్చలు చర్చలే, దాడులు దాడులేననే నెతన్యాహు అంటున్నారు. బందీల కుటుంబాలతో జరిగిన సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు ఆయన కార్యాలయం ఒక ప్రకటన చేసింది. రఫా నగరంలో పది లక్షల మందికి పైగా ప్రజలు తల దాచుకున్నారు.

హమాస్‌పై బ్లింకెన్‌ ఒత్తిడి
కాల్పుల విరమణపై కొత్త ప్రతిపాదన చేసిన నేపథ్యంలో దాన్ని అంగీకరించాలంటూ హమాస్‌పై అమెరికా ఒత్తిడి తీసుకువస్తోంది. కాగా రఫా నగరంపై, గాజాపై ఇజ్రాయిల్‌ జరిపిన దాడుల్లో 40మంది మరణించా రని ఆస్ప త్రి వర్గాలు తెలిపాయి. వీరిలో సగానికి కన్నా ఎక్కువ మంది రఫాలోనే చనిపోయారుని ఆస్ప త్రి వర్గాలు తెలిపాయి. ఈ వారంలో ఇజ్రాయిల్‌ లో అమెరికా విదేశాంగ మంత్రి బ్లింకెన్‌ పర్యటించనున్నారు. తాజా ప్రతిపాదనను ఆమోదించాంటూ ఆయన హమాస్‌ను కోరారు. ఇజ్రాయిల్‌ చాలా ఉదారంగా వ్యవహరించి ఈ ప్రతిపాదన చేసిందని ఆయన వ్యాఖ్యానించారు. అయితే ఆ ప్రతిపాదన వివరాలేంటనేది బహిర్గతం కాలేదు. గాజాలో శాశ్వతంగా కాల్పుల విరమణ జరగాలని హమాస్‌ కోరుతుండగా, ఇజ్రాయిల్‌ అందుకు ఒప్పుకోవడం లేదు. ఇజ్రాయిల్‌ నేతల అరెస్టుకు అంతర్జాతీయ క్రిమినల్‌ కోర్టు వారంట్లు జారీ చేయవచ్చని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

బీజింగ్‌ వేదికగా సయోధ్య యత్నాలు
మరోవైపు పాలస్తీనా ప్రత్యర్ధి గ్రూపులు చైనాలో సమావేశమయ్యాయి. చైనా విదేశాంగ శాఖ ఈ విషయాన్ని సోమవారం ధృవీకరించింది. ఇటీవలనే ప్రత్యర్ధి పాలస్తీనా గ్రూపులు ఫతా, హమాస్‌ల ప్రతినిధులు సమావేశమయ్యారని తెలిపింది. ఏళ్ళ తరబడి ఒకరితో ఒకరు విబేదించుకుంటూ వస్తున్న ఈ గ్రూపులు తాజా పరిణామాల నేపథ్యంలో రాజీ కోసం మరింతగా చర్చలు జరిపేలా నిర్ణయం తీసుకున్నాయి. అందులో భాగంగా చైనాలో ఇరు వర్గాల నేతలు సమావేశమై కూలంకషమైన చర్చలు జరిపారని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి లిన్‌ జియాన్‌ తెలిపారు. అయితే సమావేశం ఎప్పుడు జరిగిందనేది ఆయన వెల్లడించలేదు. చర్చలు, సంప్రదింపుల ద్వారా రాజీ పరిష్కారాన్ని సాధించాలనే రాజకీయ సంకల్పాన్ని ఇరు పక్షాలు వ్యక్తం చేశాయని చెప్పారు. నిర్దిష్టంగా పలు అంశాలపై వారు చర్చించారు. సానుకూల పురోగతి చోటు చేసుకుందన్నారు. చైనా, పాలస్తీనాకు సాంప్రదాయసిద్ధమైన స్నేహబంధం వుందని, ఈ పరిస్థితుల్లో సంఘీభావం పెంచుకుని, రాజీని కుదుర్చుకునేందుకు చైనా మద్దతిస్తుందని చెప్పారు.

➡️