మాటల్లో కాదు చేతల్లో ! పాలస్తీనియన్లకు క్యూబన్ల సంఘీభావం

Jan 28,2024 10:48 #Cuba, #Palestinians, #solidarity

హవానా : 21వ శతాబ్దంలో మరింత మెరుగైన ప్రపంచాన్ని నిర్మించాలని కోరుకుంటున్న వారందరూ సాగించే పోరాటంలో పాలస్తీనియన్లు తమ జాతి విముక్తి కోసం సాగిస్తున్న పోరాటం ప్రముఖంగా నిలుస్తుంది. దశాబ్దాలుగా లాటిన్‌ అమెరికా దేశాల్లోని వామపక్షాలు పాలస్తీనియన్లు సాగించే పోరాటాలకు బలమైన మిత్రులుగా నిలుస్తూ వచ్చాయి. ఇటీవలి మాసాల్లో ఇజ్రాయిల్‌ సాగిస్తున్న ఊచకోతకు నిరసనగా పాలస్తీనియన్లు సాగిస్తున్న పోరుకు లాటిన్‌ అమెరికాలోని వామపక్ష ప్రభుత్వాలు, ఉద్యమాలు మద్దతు తెలియచేయడమే కాకుండా మాటలకు మించి చేతల్లో తమ తోడ్పాటును కనబరుస్తున్నాయి. ఈ ప్రాంతంలో ఈ ఉద్యమానికి సంబంధించి క్యూబా అగ్ర భాగంలో వుంది. 1950లో గాజాలోని శరణార్ధ శిబిరాలను చె గువేరా సందర్శించడం నుండి, 60, 70 దశకాల్లో పాలస్తీనా గెరిల్లాలకు ప్రత్యక్షంగా సాయమందించడమే కాకుండా 1973లో ఇజ్రాయిల్‌తో దౌత్య సంబంధాలన కూడా తెగతెంపులు చేసుకుంది. ఇటీవలి కాలంలో స్వతంత్ర దేశంగా అంతర్జాతీయ గుర్తింపు పొందేందుకు పాలస్తీనా చేసిన ప్రయత్నాలకు మద్దతునిస్తూ వచ్చింది.

తాజాగా అక్టోబరు 7న దాడులు ప్రారంభమైనప్పటి నుండి క్యూబన్‌ నేతలు ఇజ్రాయిల్‌ తీరును ఖండిస్తూనే వచ్చారు. కేవలం బహిరంగంగా ప్రకటనలు చేయడంతో క్యూబా ఆగిపోలేదు. చేతల్లో కూడా తన చేతనైన సాయాన్ని అందిస్తూ వచ్చింది. హవానాలోని లాటిన్‌ అమెరికన్‌ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌ (ఇఎల్‌ఎఎం) ప్రపంచవ్యాప్తంగా గల విద్యార్ధులకు బోధిస్తుంది. ముఖ్యంగా పేద దేశాల్లోని విద్యార్ధులకు ప్రాధాన్యతనిస్తుంది. అందులో భాగంగా దాదాపు 250మంది పాలస్తీనా విద్యార్ధులకు ఈ సంస్థ స్కాలర్‌షిప్‌లు అందచేస్తోంది. భవిష్యత్తులో ఈ విద్యార్ధుల బృందం డాక్టర్లుగా వారి స్వదేశానికి వెళ్ళి సేవలందించేందుకు వీలుగా చర్యలు కూడా తీసుకుంటోంది. సంఘీభావ చర్యగా నవంబరు 17న 144మంది యువ పాలస్తీనా విద్యార్ధులతో క్యూబా అధ్యక్షుడు సమావేశమయ్యారు. ‘మీ బాగోగులన్నింటినీ క్యూబా చూస్తుంది. మీ కెరీర్‌ రూపకల్పనలో మేం కూడా భాగస్వాములవుతాం. మీరందరూ పాలస్తీనా భవిష్యత్‌.” అంటూ క్యూబా నేత వారిని ఉద్దేశించి ప్రసంగించారు. క్యూబా అధ్యక్షుడికి విద్యార్ధులు తమ పోరాటానికి చిహ్నమైన తెలుపు, నలుపు రంగు స్కార్ఫ్‌ను బహుకరించారు. ఆ తర్వాత వారంలో నవంబరు 24న దాదాపు లక్షమంది ప్రజలు హవానాలో ప్రదర్శన నిర్వహించారు. పాలస్తీనియన్లకు మద్దతు ప్రకటించారు. ఇతర ప్రపంచ నేతల వైఖరికి పూర్తి విరుద్ధంగా అధ్యక్షుడు డియాజ్‌ కానెల్‌ ప్రదర్శన అగ్ర భాగాన నిలిచి పాలస్తీనియన్ల పోరాటానికి ప్రతీక అయిన నలుపు, తెలుపు స్కార్ఫ్‌ను ఊపుతూ అభివాదం చేశారు.

➡️