నస్రత్‌ శరణార్ధి శిబిరం, వెస్ట్‌ బ్యాంక్‌పై ఇజ్రాయిల్‌ బాంబు దాడులు

Apr 12,2024 23:24 #Gaza, #Israeli bombings

31మంది మృతి
గాజా : గాజా శరణార్ధుల శిబిరంపై ఇజ్రాయిల్‌ బాంబు దాడులకు పాల్పడింది. వెస్ట్‌ బ్యాంక్‌లోని పట్టణాలపైనా దాడులు జరిపింది. సెంట్రల్‌ గాజాలోని నస్రత్‌ శరణార్ధ శిబిరంపై ఇజ్రాయిల్‌ సైన్యం బాంబులు, శతఘ్నులతో విరుచుకుపడింది. గాజా నగరంలోని దరాజ్‌ ప్రాంతంలో గల ఇంటిపై జరిగిన దాడిలో మొత్తంగా 29మంది మరణించారని వార్తలందాయి. ఆక్రమిత వెస్ట్‌ బ్యాంక్‌లోని టుబస్‌ ప్రాంతంలో జరిపిన దాడిలో ఇద్దరు పాలస్తీనియన్లు మరణించారు.
ఖాన్‌ యూనిస్‌లో పెను విధ్వంసం : డబ్ల్యుహెచ్‌ఒ
ఖాన్‌ యూనిస్‌ నగరం నుండి ఇజ్రాయిల్‌ బలగాలు వైదొలగిన నేపథ్యంలో అక్కడకు తిరిగి ప్రజలు వెళ్తుండడంతో చోటు చేసుకున్న విధ్వంసం తీరు తెన్నులు బయటి ప్రపంచానికి తెలుస్తున్నాయి. ఏ ఒక్కరూ ఊహించని రీతిలో అక్కడ పెను విధ్వంసం చోటుచేసుకుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. గాజాలో కరువు నెలకొందని ఐక్యరాజ్య సమితి ఇప్పటికి చాలా కాలం నుండి హెచ్చరిస్తూనే వస్తోంది. ఉత్తర గాజా క్షామం బారిన పడిందన్నది వాస్తవమేనని యుఎస్‌ ఎయిడ్‌ చీఫ్‌ సమంతా పవర్‌ ప్రకటించారు. గాజా ఆకలి కేకలు గురించి బహిరంగంగా వెల్లడించిన మొదటి అమెరికా అధికారి ఆమె.
ఇజ్రాయిల్‌కు ఆయుధాలు అందజేస్తున్నందుకు జర్మనీపై ఐదుగురు పాలస్తీనియన్లు కేసు దాఖలు చేశారని పాలస్తీనియన్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎన్‌జిఓ తెలిపింది. జర్మనీ ప్రభుత్వం జారీ చేసిన ఎగుమతి లైసెన్సులను తక్షణమే రద్దు చేయాలని వారు ఆ ఫిర్యాదులో కోరారు.

➡️