రఫాలో కొనసాగుతున్న దాడులు : 24మంది మృతి

Feb 4,2024 09:41 #24, #Attacks, #killed, #Rafah
  • ఆకలితో అల్లాడుతున్న చిన్నారులు

గాజా : రఫా నగరంలోని తూర్పు భాగంలో గత రాత్రంతా జరిగిన దాడుల్లో 24మంది మరణించారు. ఆస్పత్రుల్లో సరైన వైద్య సదుపాయాలు, సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో గాయపడిన వారు మరణిస్తుండటంతో, మృతుల సంఖ్య పెరుగుతోంది. గాయపడిన వారికి తగిన రీతిలో చికిత్సనందించే పరిస్థితి లేదు, దాంతో డాక్టర్లు, ఇతర సిబ్బంది కోసం ఎదురుచూస్తూ నేలపై పడి వున్న వారు అలాగే ప్రాణాలు కోల్పోతున్నారు. గాజా పశ్చిమ ప్రాంతంలో ఇస్లామిక్‌ యూనివర్శిటీ వున్న ప్రాంతంలో కూడా కాల్పులు మొదలైనట్లు వార్తలు వస్తున్నాయి. యుద్ధం ఆరంభంలో తీవ్రంగా ధ్వంసమైన యూనివర్శిటీ ఆవరణ తదనంతర కాలంలో నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించింది. తాజాగా ఇజ్రాయిల్‌ మిలటరీ అక్కడ కూడా దాడులు ప్రారంభించింది. మొత్తంగా నగరమంతా శిధిలాల గుట్టగా మారింది. ఇప్పటివరకు గాజాలో 27,238మంది మరణించగా, 66,452మంది గాయపడ్డారు. ఈ యుద్ధం కారణంగా తల్లిదండ్రులను, అయినవారిని పోగొట్టుకున్న చిన్నారులు తమ ఆకలి తీర్చుకోవడానికి ఎక్కడ ఆహారం దొరుకుతుందా అని చూస్తూ వీధుల్లో పడి తిరగడం కనిపిస్తోంది. గాజాలో పది లక్షల మందికి పైగా నిర్వాసితులైన ప్రజలు ఆకలి బాధతో అల్లాడుతున్నారు. దీనికి తోడు అత్యంత చలి కారణంగా తల దాచుకునే గూడు లేక ఇబ్బందులు పడుతున్నారు. అంతర్జాతీయ న్యాయస్థానం రూలింగ్‌ ఇచ్చి వారం రోజులవుతున్నా ఇప్పటివరకు ఇజ్రాయిల్‌ దాన్ని పట్టించుకోవడం లేదు. ఈ వారం రోజుల వ్యవధిలోనే వెయ్యి మందికి పైగా పాలస్తీనియన్లను చంపేశారని గాజా ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ఖాన్‌ యూనిస్‌ నగరాన్ని ఖాళీ చేయాలంటూ ఇజ్రాయిల్‌ బలగాలు ఆదేశిస్తుండడంతో పెద్ద సంఖ్యలో ప్రజలు మూటాముల్లె సర్దుకుని వెళ్లిపోతున్నారు. అలా వెళుతున్నవారిపై కూడా బలగాలు కాల్పులు జరుపుతున్న వీడియో ఒకటి బయటకు వచ్చింది.

➡️