రాజకీయ అనిశ్చితిలోనే పాక్‌

Feb 25,2024 11:01 #Coalition, #Pakistan

అధికార పంపక ఒప్పందం కుదిరినా

ఇస్లామాబాద్‌  :    కొత్త సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటు విషయమై పాకిస్తాన్‌ ముస్లిం లీగ్‌ నవాజ్‌ (పిఎంఎల్‌-ఎన్‌), పాకిస్తాన్‌ పీపుల్స్‌ పార్టీ (పిపిపి) మధ్య ఒప్పందం కుదిరినప్పటికీ భారీ యెత్తున రిగ్గింగ్‌ చోటు చేసుకున్న ఈ ఎన్నికల ఫలితాలను తాము గుర్తించడం లేదని ఇమ్రాన్‌ఖాన్‌ నేతృత్వంలోని పాకిస్తాన్‌ తెహ్రీక్‌ ఇ ఇన్సాఫ్‌ (పిటిఐ)తో సహా పలు పార్టీలు ప్రకటించాయి. దీంతో పాకిస్తాన్‌ రాజకీయ అనిశ్చితి నుండి ఇప్పట్లో బయటపడేలా కనిపించడం లేదు. ఎన్నికల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయంటూ ఖైబర్‌ ఫక్తూంఖ్వాలో వామపక్ష అవామీ నేషనల్‌ పార్టీ నిరసన ఆందోళనలకు పిలుపునిచ్చింది. పిటిఐ ఇప్పటికే దేశ వ్యాపితంగా నిరసనలు చేపట్టింది. ఎన్నికల్లో రిగ్గింగ్‌కు వ్యతిరేకంగా మితవాద పార్టీ జమాతే ఉలేమాా ఇ ఇస్లామ్‌ ఫజల్‌ (జెయుఐాఎఫ్‌) విడిగా నిరసనలకు పిలుపునిచ్చింది.2018లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో ఒక స్థానం గెలుచుకున్న అవామీ నేషనల్‌ పార్టీ (ఎఎన్‌పి) ఈ సారి ఒక్క సీటు కూడా గెలవలేదు. పోలింగ్‌కు ముందు, ఓట్ల లెక్కింపు సందర్భంలోనూ భారీగా అక్రమాలు, ఫలితాలను తారు మారు చేయడం వంటివి చోటు చేసుకోవడం వల్లే తమ పార్టీ ఓడిపోయిందని ఎఎన్‌పి నేత ఒకరు పేర్కొన్నారు. అక్రమాలు, మ్యానిపులేషన్‌ వంటివి లేకుండా ఎన్నికలు న్యాయంగా జరిగి వుంటే గత సారి కన్నా ఎక్కువ స్థానాలు తమకు దక్కేవని జెయుఐాఎఫ్‌ పేర్కొంది. ఆ పార్టీకి ఈ సారి నాలుగు స్థానాలే లభించాయి. రిగ్గింగ్‌, ఫలితాల తారుమారు వంటివి లేకుంటే తమకు సంపూర్ణమైన మెజార్టీ లభించేదని పిటిఐ పేర్కొంది. ఈ ఎన్నికల ఫలితాలను తాము కోర్టుల సవాల్‌ చేస్తామని తెలిపింది. పంజాబ్‌ అసెంబ్లీలో తమకు స్పష్టమైన మెజార్టీ ఉన్నా, అసెంబ్లీ తొలి సమావేశానికి హాజరుకాకుండా తమ సభ్యులను అడ్డుకున్నారని పిటిఐ పేర్కొంది.

నేరుగా ఎన్నికైన స్థానాలకు కాకుండా, 70 రిజర్వుడు స్థానాలను పార్టీలకు లభించిన ఓటింగ్‌ శాతాన్ని బట్టి కేటాయించడంలో ఎన్నికల సంఘం విఫలమైంది. పిటిఐ తరపున ఇండిపెండెంట్లుగా పోటీ చేసి గెలిచిన ప్రతినిధులను సున్నీ ఇత్తెహాదుల్‌ కౌన్సిల్‌ (ఎస్‌ఐసి) పార్టీలో కలిపి తమకు ఇంత ఓటింగ్‌ శాతం ఉంది కాబట్టి పార్టీ ప్రాతిపదికన రిజర్వుడు స్థానాలను కేటాయించాలని కోరింది. ఈ ఎన్నికల్లో ఎస్‌ఐసి నిజానికి ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. సొంతంగా పార్లమెంటులో ఒక్క స్థానం కూడా గెలవలేని ఎస్‌ఐసి పార్టీకి రిజర్వుడు స్థానాలను కేటాయించే విషయమై ఎన్నికల సంఘం ఎటూ తేల్చుకోలేకపోవడమే ఈ జాప్యానికి కారణమని ఇసి వర్గాలు తెలిపాయి. పిటిఐపై ఎన్నికలకు ముందు నిషేధం విధించినందున పార్లమెంటు, వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థులు పలువురు ఇండిపెండెంట్లుగా ఎన్నికల్లో పోటీ చేయాల్సి వచ్చింది.

రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ప్రతినిధులను కూడా ఇదే ఉద్దేశంతో ఎస్‌ఐసిలో విలీనం చేసింది.పిఎంఎల్‌-ఎన్‌, పిపిపి మధ్య కుదిరిన అధికార పంపక ఒప్పందం ప్రకారం ప్రధాన మంత్రి పదవిని పిఎంఎల్‌- ఎన్‌ నేత, మాజీ ప్రధాని షెబాజ్‌ షరీఫ్‌కు అప్పగించనున్నారు. దీనికి ప్రతిగా దేశాధ్యక్షపదవి పిపిపి నేత అసిఫ్‌ అలీ జర్దారీకి ఇవ్వనున్నారు. దీంతోబాటు పంజాబ్‌, ఖైబర్‌ ఫంక్త్వూన్‌ రాష్ట్రాల గవర్నర్ల పదవులు కూడా పిపిపికి కేటాయించారు. సింధు గవర్నరు పదవిని ముత్తాహిదా క్వామీ మూవ్‌మెంట్‌ (ఎంక్యుఎం)కు ఇవ్వనున్నారు. పాకిస్తాన్‌ ఎన్నికల సంఘం వెల్లడించిన తుది ఫలితాల ప్రకారం నేరుగా ఎన్నికలు నిర్వహించిన మొత్తం 265 పార్లమెంటు స్థానాలకు గాను పిటిఐ బలపరిచిన ఇండిపెండెంట్లు 90 స్థానాలు గెలుచుకోగా, పిఎంఎల్‌-ఎన్‌-75, పిపిపిా54, ఎంక్యుఎం-17 స్థానాలను సాధించాయి. పాకిస్తాన్‌ పార్లమెంటు ఎగువ సభ అయిన సెనేట్‌ ప్రతినిధులను కొత్తగా ఎన్నికైన అసెంబ్లీలు ఎన్నుకోవాల్సి ఉంది. కొత్త అసెంబ్లీలు కొలువుదీరిన తరువాత సెనేట్‌ ఎన్నికలు జరుగుతాయి.

➡️