ఆకలితో గాజాలో రంజాన్

గాజా : గాజా నగరంలో ఆకలి, బాంబుల మధ్య పాలస్తీనియన్లు రంజాన్ ప్రారంభానికి సిద్ధమయ్యారు. కాల్పుల విరమణ చర్చలు నిలిచిపోవడంతో ఈ ఏడాది రంజాన్ తీవ్ర అభద్రతా స్ధితిలో ఉంది. ఇఫ్తార్‌లో అలంకరించుకోవడానికి ఇళ్లు లేదు, విందు చేయడానికి ఆహారం లేదు. ‘‘ఈసారి ప్రత్యేకంగా ఎలాంటి సన్నాహాలు చేయడం లేదు. మా దగ్గర క్యాన్డ్ ఫుడ్ మాత్రమే ఉంది. చాలా ఆహార పదార్థాలు ఊహించలేనంత ఖరీదైనవి” అని రఫాలోని శరణార్థి మహా అన్నారు. దక్షిణ గాజాలోని రఫాలో, సగం జనాభా ప్లాస్టిక్ గుడారాలలో నివసిస్తున్నారు. కాగా, గాజాలో ఇజ్రాయెల్ దాడిలో మరణించిన వారి సంఖ్య 31,045 దాటింది. ఇజ్రాయెల్ సైన్యం దాడులు కొనసాగిస్తోంది. నుసైరత్ శరణార్థి శిబిరం, అల్-మవాసి ప్రాంతంలో మహిళలు, పిల్లలు సహా 15 మంది మరణించారు. ఆహారం దొరకక ఉత్తర గాజాలో పౌష్టికాహార లోపంతో ఓ పసికందు, యువతి చనిపోయారు. దీంతో ఆకలి చావులతో మరణించిన వారి సంఖ్య 25కి చేరింది. రంజాన్ సమీపిస్తుండటంతో, ఇజ్రాయెల్ జెరూసలేంలోని అల్-అక్సా మసీదు చుట్టూ వేలాది మంది పోలీసులను మోహరించింది. వెస్ట్ బ్యాంక్ కూడా గట్టి నియంత్రణలో ఉంది.

➡️