నిరసనలతో భగ్గుమన్న అర్జెంటీనా

Apr 26,2024 08:54 #Argentina, #outrage, #Public

– బ్యూనస్‌ ఎయిర్స్‌లో భారీ మార్చ్‌
– పొదుపు చర్యలకు వ్యతిరేకంగా గర్జించిన విద్యార్థిలోకం
బ్యూనస్‌ ఎయిర్స్‌: మితవాద జేవియర్‌ మిలే ప్రభుత్య పొదుపు చర్యలపై అర్జెంటీనా విద్యార్థి లోకం భగ్గుమంది. ఉన్నత విద్యకు బడ్జెట్‌లో ఎడా పెడా కోత పెట్టడం, ప్రభుత్వ యూనివర్సిటీ వ్యవస్థను నిర్వీర్యం చేసే మిలే నిరంకుశ చర్యలకు వ్యతిరేకంగా రాజధాని బ్యూనస్‌ ఎయిర్స్‌లో ప్లాజా డి మేయాలో మంగళవారం విద్యార్థులు భారీ మార్చ్‌ నిర్వహించారు. ‘ మా కలలను భగం చేయడానికి మీరెవరు?’ ‘మా భవిష్యత్తును చిదిమేసే అధికారం మీకెవరిచ్చారు?’ , ‘దేశం అమ్మకానికి సిద్ధంగా లేదు’ అన్న నినాదాలతో ఆ ప్రాంతం మార్మోగిపోయింది. విద్యార్థుల ఆందోళనకు మానవ హక్కుల గ్రూపులు, కార్మిక సంఘాలు, వామపక్షాలు తమ పూర్తి మద్దతు ప్రకటించాయి. నిరసనకారులతో ప్లాజా డిమేయా కిక్కిరిసిపోయింది. ఈ మార్చ్‌నుద్దేశించి అర్జెంటీనా యూనివర్సిటీ ఫెడరేషన్‌ అధ్యక్షుడు పీరా ఫెర్నాండెజ్‌ డి పికోలి మాట్లాడుతూ, ద్రవ్యోల్బణం కనివిని ఎరుగని రీతిలో పెరిగిపోయిన ఈ స్థితిలో బడ్జెట్‌లో ఉన్నత విద్యకు నిధులు పెంచాల్సింది పోయి కోత పెట్టడం దారుణమని అన్నారు. విద్యా హక్కు మానవ హక్కు అని , అసమానతలను తగ్గించడంలో కీలక పాత్ర పోషించే విద్య ప్రభుత్వ రంగంలోనే ఉండాలని ఆయన ఉద్ఘాటించారు.. పబ్లిక్‌ యూనివర్సిటీలను ప్రైవేట్‌ పరం చేసే మిలే ప్రభుత్వ చర్యలను తిప్పికొట్టాల్సిన అవసరముందన్నారు. ఈ ఉద్యమానికి బయట నుంచి మద్దతు ఇస్తున్న పౌర సమాజానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఉన్నత విద్యకు ఈ ఏడాది కేటాయించిన బడ్జెట్‌ ఆరు మాసాలకు కూడా చాలదని నేషనల్‌ ఇంటర్నల్‌ యూనివర్సిటీ కౌన్సిల్‌ వ్యాఖ్యానించింది. నిధుల కొరత వల్ల యూనివర్సిటీల్లో కొన్ని ఫ్యాకల్టీలు కొత్తగా చేర్చుకునే విద్యార్థుల సంఖ్యను బాగా కుదించేశాయి. లేబొరేటరీలకు అవసరమైన సామాగ్రి కూడా తెప్పించుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే ప్రభుత్వ యూనివర్సిటీలు సంక్షోభంలో పడ్డాయి. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలన్నా ప్రభుత్వ వర్సిటీలను కాపాడుకోవాలని అన్నారు. ఈ నిరసనలపై మాజీ యూనివర్సిటీ ప్రోఫెసర్‌, పచ్చి మితవాది అయిన మిలే స్పందిస్తూ, మార్పును అడ్డుకోవడమే వీరి పని అని, నిరసనలో పాల్గొన్నవారంతా పాత ముఖాలేనని హేళన చేశారు. తన ప్రైవేటీకరణ విధానాలను సమర్థించుకున్నారు. మిలే ప్రభుత్వం పొదుపు చర్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని, లేకుంటే తమ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని విద్యార్థి సంఘాల నేతలు హెచ్చరించారు.

➡️