మార్పుని స్వీకరిద్దాం!

May 19,2024 08:27 #Sneha, #Women Stories
Let's embrace the change!

అవునుగానీ ఓ మాటడుగుతాను. విని మరట్టే న్యాయం చెప్పండి. మూడు ముక్కల్లో చెప్పనుగాక చెప్పను. కనక కాస్త ఓపిక పట్టండి. మనదేశంలో, అనగా యీ విశాల భారత దేశంలో అనాది నించీ యెవరికి తోచినట్లుగా వాళ్లు బట్టలు కట్టుకుంటూనే వచ్చారు గద. సంప్రదాయమో దిబ్బో దిరుగుండమో యెవరి అలవాట్లో, పొరపాట్లో వారివిగా చేసుకుంటూ వేసుకుంటూ వచ్చాము.
ఇకముందూ వేసుకుంటూ వస్తాము కూడా. దీనికి గానూ నిర్దిష్టమైన పద్ధతులు పాటించేవారు కొందరయితే, మరికొందరు మాకు తోచినట్లు బట్టలు కట్టుకుంటామూ మా సౌఖ్యం, మా సరదా అనీ అంటున్నాము. అవునా? ఆ మాత్రం స్వాతంత్య్రం మనిషికి వుండాలి మరి.
ఒకప్పుడు చీర తప్ప మరోటేదీ కట్టి యెరగని స్త్రీలూ యిప్పుడు పంజాబీ దుస్తులూ కాశ్మీరీ దుస్తులూ వేసుకుని హాయిగా తిరుగుతూండగా లేనిది, ఆడపిల్లలు బ్లూజీన్స్‌ చొక్కాయిలూ వేసుకునేసరికి నిందలు పడాల్సి రావడం ఆశ్చర్యంగానే వుంది. కేరళలో చాలా కాలం వరకూ ఆడవాళ్లు వేసుకుండిన ఖాళీ వృక్షోజాల బట్టల విషయమూ, బాగా తూరుపున ఆడవాళ్లకి రవికెలు లేని వైనమూ అందరికీ తెలిసినదే.
మా నాయనమ్మ 1900 చిల్లరలో లో జాకట్లు వేసుకునేసరికి అప్పటి వాళ్లు అపచారం అని గగ్గోలు పెట్టారట. అప్పటికి
పది నెలల వయసున్న మా పెదనాన్నతోటీ మా తాతగారితోటీ తీయించుకున్న ఫొటోల్ని మేమంతా చూసినవాళ్లమే. మహీధర రామ్మోహన్‌ రావు ఆ చంటి పిల్లడు. ఆయన పుట్టినది నవంబరు 1909లో. మా వూళ్లోనే గాదు, మన సరమ్మ బూబమ్మ అయిపోయిందని ఆవిణ్ని, భ్రష్టుడయిపోయాడని మా తాతయ్యను కోనసీమలో తిట్టని వాళ్లు లేరట.
ఆడాళ్లు జాకట్లు వేసుకోవడం వచ్చినాక మరెన్నో మార్పులు వచ్చినాయి. ఇప్పుడంతా కాలమెంతో మారిన చరిత్ర మరిచిపోయారు! మా అమ్మా, పెద్దమ్మా అత్తలూ గూడకట్టు కట్టుకుంటాము, గోచిపోసి చీరలు కట్టుకోమని 1930 ల తరవాతిరోజుల్లో
తిరుగుబాటు చేశారుట. అప్పుడూ వూరూవాడా పెద్ద రగడలే వచ్చాయి మరి. మా బామ్మ పెద్ద సపోర్టుగా నిలిచిందీమాటు మా తాతకి.
ఆ తర్వాత వాళ్లు మేము చీరల కింద లంగాలు కట్టుకుంటామూ అనేసరికి మరో తిరుగుబాటు అవసరమైంది. ఇదంతా యెందుకు చెబుతున్నాను? గొప్పలకి కాదు. నేనెప్పుడూ సాధ్యమైనంతవరకూ అనుభవాలూ జ్ఞాపకాలూ వున్న విషయాల్ని
చెప్తేనే మంచిదనుకుంటాను. అంతే కాదు. ఆగథా క్రిస్టీ ఒక నవలలో లాగ నివశ్రీవజూష్ట్రవఅ్‌ర తీవఎవఎbవతీు అవే కాదు నేనూనూ. నిఱ తీవఎవఎbవతీ ్‌శీశీ.ు ఇలా అంటున్నానని తిట్టకండి, కానీ సూయీ ధాగా లోనించి సూది దారమూ వచ్చినట్లు భాషా వేత్తలు చెప్పారు. మనకి బట్టలు కుట్టడమూ పై సంస్కృతుల నించి దిగుమతి అయినదే అని తెలుసుకుంటే మనకి పోయినదేముందీ? తప్పేముందీ? అందులో పరువు నష్టమేముందీ?
ఈలోగా మగాళ్లు మాత్రం తమకి పై చదువులనో, వుద్యోగాలనో ముందస్తుగా చొక్కాలు కోట్లతో మొదలెట్టి నెమ్మదిగా
పొడుగు లాగుల్లోకి, మరో వాటిలోకీ దిగారుగద. మగవాళ్ల దుస్తులలోని యీ మార్పుల్ని ఒప్పుకున్నవాళ్లు కూడా ఆడవాళ్ల దుస్తులలోని మార్పుల్ని ఒప్పుకోలేదోపట్టాన్ని. అందులోనూ ఆడవాళ్లే తీవ్ర విమర్శకులయ్యారు! అప్పుడూ యిప్పుడూ కూడా ఆడవాళ్లే తమ తోటి ఆడవాళ్ల వేషధారణనీ వాళ్ల బట్టల యెన్నికలనీ ఎత్తి చూపి మరీ వాళ్లని ఆక్షేపించేది! ఇది మహా బాగుందా?
తర్వాత చదువులు పెరిగే కొద్దీ ముచ్చట్లూ లావయ్యాయి. పై ప్రపంచమూ మరింతగా పరిచయమవుతూ వచ్చింది. తిరుగుళ్లూ పెరిగాయి. రుచులూ మారుతూ వచ్చాయి.
మొదట నైటీ యెవరేసుకున్నారో తెలీదుగానీ ఆ మహాతల్లి దేశాన్నే మార్చేసింది. ఆవిడకి జిందాబాద్‌, ఆవిడ (అదేమిటీ? ఆ, ) అమర్‌ రహే! ఇప్పుడయితే, ఒకప్పుడు తట్టెడు చీరలూ వుతకలేక చచ్చిన వాళ్లంతా (యిప్పుడు మెషీనులొచ్చినా) ఆవిడ పేరు పెట్టి అఖండ దీపం వెలిగించాల్సిందే!
నేనూ ఓ దీపం వెలిగించాల్సిందే! ఏమయిందీ? నేను, మా ఆయనా పెళ్లయిన తర్వాత అత్తారు నగలకోసం
యిచ్చిన డబ్బు తీసుకుని నైనితాల్‌ కి పరారయ్యాము. మూడు వారాలపాటు హాయిగా తిరిగేసి ఖాళీ చేతులతో నయినా వాపసు రాకండా నేను మాత్రం రెండు నైటీలతో తిరిగొచ్చాను. అది 1962.. ఇంకేముందీ కొంపలంటుకున్నాయి. ఇరుగూ పొరుగూ మా అత్తగారిని ఘాటుగా మాటలన్నారు. పాపం యెంత మారుతూ వచ్చినా యీ విమర్శలకి ఆవిడకీ చుర్రుమంది. అవి పెట్టెలో దాచెరు అన్నారు. అసలే నా ముద్దు పేరు చండిక మా పుట్టింట. ‘అవునంటే కాదందీ మరి కాదంటే అవునందీ’ అనేరకం. చివరికి రాత్రి తొమ్మిది దాటాకా , పొద్దుటే ఆరింటి లోగానూ మార్చేందుకు సంధి పత్రాల మీద ఒప్పందం జరిగింది.
చూడండిప్పుడు లోకమెంతగా మారిందో? కనక ఆ తొట్టతొలి వనితకి జోహార్లిద్దామా వద్దా? వెధవది బట్టలతోటే యింత వివాద వాగ్వివాద ప్రతివాదాలా?
ఇక ఆడపిల్లల చదువులూ పెళ్లిళ్లో ? అబ్బూరి ఛాయాదేవి చదువూ పెళ్లీ నాకింకా గుర్తున్నాయి. పాపం మద్దాలి వెంకటచలం గార్ని విమర్శించారు. ఆయన మహా గట్టి మనిషి. తన ఆదర్శాలకి కట్టుబడ్డ మనిషి. సరే మావాళ్లు మరీ ముదిరిపోయారని దూరం తప్పుకున్నారు. మహీధర వాళ్లు మరీ బరి తెగించిన రకమని ఒగ్గీశారు. నాకు బాగా గుర్తున్న ఒక విషయం. 1965 లో గాల్వస్టన్‌ బీచికి (హ్యూస్టను పక్కని) విద్యార్థుల ప్రయాణం. కొందరు లాగులూ చొక్కాలు వేసుకున్నారు, మరి కొందరు పొట్టి లాగులూ వేసుకున్నారు.
అది నానా దేశ జాతి సమ్మేళనం. సరేనని నేనూ పొడుగు లాగే సుమండీ, పాదాలు దాటినదే వేసుకున్నాను. అప్పుడు రెండు వేళ్ల వెడల్పే కూడా వుంటిని. మనవాళ్లెవరూ లేరుగదానని నెలికాను కూడా. నా చొక్కాయి కూడా గలీబు వలే వదులయినదే సుమండీ. మనలో మనమాట. అది నా వినయం కాదు నా మిడ్జెట్‌ సైజు అలాంటిది! అనుకోకుండా బీచిలో ఓ చెత్త పత్రిక వాడు అడ్డుతగిలి మీ దేశస్తులు స్విమ్‌ సూటు వేసుకోకూడదా, తప్పా అని అడిగాడు. నేను బహు దేశభక్తితో మాది స్వతంత్ర దేశం యిష్టమైతే వేసుకోవచ్చు.. అని చెప్పాను. తప్పేముంది చెప్పండి? నేనెంత రాజమండ్రి వాసినయినా మనకీ మహా నగరాలున్నాయి గదా? హిందీ సినిమాలు దండిగా చూసిన వారమేగా.. అందుకని అలా చెప్పాను.
అయితే నేను చూసుకోలేదు దూరంగా పట్టుచీర ధరించిన మరో మాధవీలత గారి వంటి విదుషీమణి వున్నారని. ఆమె ఏక ధాటిగా నన్ను ఒక చవకబారు మనిషిగా, దేశద్రోహిగా చీల్చి చెండాడి.. దూది యేకినట్లు యేరి పారేసింది. అసలయిన భారతీయ వనితలు పాశ్చాత్య వేషధారణ మరణించినా వేసుకోరు. ఈమె క్రిస్టియన్‌ అయి వుంటది.. అని కూడా వుద్ఘాటించింది. నా మిత్రులూ పక్కనున్నవారూ తెల్లబోయి చూశారు. అకస్మాత్తుగా యీ విజృంభణకి. నా నోరు తడారిపోయింది.
ఇదంతా యివాళ నవ్వుతూ చెప్తున్నాను గానీ అప్పుడు మాత్రం చాలా నొప్పి కలిగిన మాట వాస్తవం. మన మాధవీలతగారి ఘాటు విమర్శలు ఇవాళ యూ ట్యూబులో చూసేసరికి, నన్ను చూడడానికొచ్చిన నా చెల్లి కొడుకు కూడా ఆ వీడియో చూసి హడిలిపోయినాక వాడితో చెప్పాను..
”లోకమూ మారెనూ, రోజులూ మారెనూ
అయినా మనము మారలేదూ, మన దుగ్ధ తీరలేదూ” అని. బహుశా దిక్కుమాలిన స్విమ్‌ సూట్ల దాకా వద్దు గానీ మామూలు బ్లూజీన్లేసే ఆడపిల్లల్ని బాణం యెక్కుపెట్టి కొట్టే రోజులూ రావచ్చేమో యీ పవిత్ర భారతంలో మున్ముందిక ముసళ్ల పండగ.

– సుశీల కంభంపాటి

➡️