కదం తొక్కిన స్పానిష్‌ రైతులు

Feb 22,2024 10:33 #Dharna, #framers, #Spanish
  •  మాడ్రిడ్‌లో ట్రాక్టర్లతో పరేడ్‌

మాడ్రిడ్‌: వ్యవసాయ రంగంలో యూరోపియన్‌ యూనియన్‌ చేపట్టిన వినాశకర విధానాలకు వ్యతిరేకంగా స్పెయిన్‌లో రైతులు గత కొన్ని రోజులుగా సాగిస్తున్న పోరాటం బుధవారం పతాకస్థాయికి చేరుకుంది. వివిధ రైతుల సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు ఫిబ్రవరి21న రాజధాని మాడ్రిడ్‌ను రైతులు ముట్టడించారు. దేశ నలుమూలల నుంచి కాలి నడకన, ట్రాక్టర్ల ద్వారా బుధవారం చేరుకున్న రైతులు రాజధాని మాడ్రిడ్‌లోని సెంట్రల్‌ ఇండిపెండెన్స్‌ స్వ్కేర్‌ నుంచి వ్యవసాయ మంత్రిత్వ శాఖ కార్యాలయం వరకు భారీ పరేడ్‌ నిర్వహించారు. ఐదు వరుసల్లో ట్రాక్టర్లు ఈ పరేడ్‌లో పాల్గొన్నాయి. పసుపు రంగు దుస్తులు ధరించిన ఆందోళనకారులు స్పానిష్‌ పతాకాలు చేబూని, ఆవు గంటలను మోగించారు. రాజధాని వీధులన్నీ ఆందోళనకారులతో నిండిపోయాయి. ప్రభుత్వం అడుగడుగునా ఆంక్షలు విధించింది. రాజధానిలోకి 500 ట్రాక్టర్లను మాత్రమే అనుమతిస్తామని చెప్పింది. రాజధాని శివార్లలోనే చాలా ట్రాక్టర్లను పోలీసులు నిలిపేశారు. దీంతో రైతులు కాలినడకన రాజధానిలో ప్రవేశించారు. బార్సిలోనా, జరాగోజా, కెటాలినా తదితర ప్రాంతాల నుంచి వేలాది ట్రాక్టర్లతో రైతులు తరలివచ్చారు. వీరిని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. విపరీతంగా పెరిగిపోయిన వ్యవసాయ ఉత్పత్తి ఖర్చులను తగ్గించాలని, పర్యావరణ అనుకూల విధానాలపేరుతో పురుగు మందులు, ఇతర రసాయనిక ఎరువుల వాడకంపై పెట్టిన ఆంక్షలు సడలించాలని, తీవ్ర కరువు పరిస్థితులను ఎదుర్కొంటున్న రైతాంగానికి పరిహారం చెల్లించాలని వారు నినదించారు. వ్యవసాయ రంగానికి సాయం చేయడంలో ప్రభుత్వం విఫలమైందని, రైతులకు ప్రోత్సాహక ధరలు కావాలని ద్రాక్ష రైతు లూసియా రిసెనో డిమాండ్‌ చేశారు. గతంలో ఎంత ఖర్చు పెట్టానో ఇప్పుడూ అంతే పెడుతున్నా అందులో సగం మొత్తం కూడా ఇప్పుడు రావడంల లేదని ఆమె వాపోయారు. తమ సమస్యలను పరిష్కరించాలని ఎంతో కాలంగా కోరుతున్నా ప్రభుత్వం పెడచెవిన పెట్టడంతో రైతు సంఘాలు ఈ నిరసనలకు పిలుపునిచ్చాయి. ఉద్యమిస్తున్న రైతు సంఘాల ప్రతినిధి బృందాన్ని ప్రభుత్వం చర్చలకు పిలిచింది. ఇదే తరహా ఆందోళనలు గ్రీస్‌, ఫ్రాన్స్‌, పోలండ్‌ వంటి ఇతర యూరపు దేశాల్లో ఇటీవల తలెత్తిన సంగతి తెలిసిందే.

➡️