US Expert : తదుపరి మహమ్మారి బర్డ్‌ఫ్లూ కావచ్చు

Jun 17,2024 11:32 #Bird Flu, #Next Pandemic, #US Expert

వాషింగ్టన్‌ :    తదుపరి మహమ్మారి బర్డ్‌ఫ్లూ నుండి రావచ్చని అమెరికా నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. త్వరలో ఈ వైరస్‌ వ్యాప్తి చెందవచ్చని అన్నారు. ఇప్పటికే పాడి పశువులలో వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందుతోందని చెప్పారు. ఈ వైరస్‌ మనుషులకు సోకినపుడు కరోనాతో పోలిస్తే మరణాల రేటు అత్యధికంగా ఉంటుందని సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ (సిడిసి) మాజీ డైరెక్టర్‌ రాబర్ట్‌ రెడ్‌ఫీల్డ్‌ పేర్కొన్నారు. ఆదివారం ఆయన ఓ న్యూస్‌ ఛానెల్‌తో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో బర్డ్‌ఫ్లూ మహమ్మారి రావచ్చని, అయితే ఎప్పుడు ప్రారంభమౌతుందనే దానిపై స్పష్టతనివ్వలేమని అన్నారు. కానీ బర్డ్‌ఫ్లూకు చాలా ఎక్కువ అవకాశం ఉంటుందని తాను అనుకుంటున్నానని రెడ్‌ఫీల్డ్‌ పేర్కొన్నారు. కొవిడ్‌ కారణంగా మరణాల రేటు 0.6 శాతం ఉండగా, బర్డ్‌ ఫ్లూతో మరణాల రేటు 25 నుండి 50 శాతం ఉండవచ్చని అంచనావేశారు.

బర్డ్‌ఫ్లూ మూడవ మానవ కేసును గత నెల అమెరికా అధికారులు గుర్తించారు. ప్రపంచ వ్యాప్తంగా బర్డ్‌ఫ్లూ స్ట్రెయిన్‌ హెచ్‌ 5ఎన్‌1 వలన కలిగే 14 రకాల  మానవ ఇన్ఫెక్షన్‌లను వైద్యులు గుర్తించారు. అయితే మానవుల మధ్య ఈ వైరస్‌ వ్యాప్తి చెందుతుందనేది నిర్థారణ కాలేదని రాబర్ట్‌ పేర్కొన్నారు.

➡️