కాల్పుల విరమణకు మళ్లీ మోకాలడ్డిన అమెరికా

us-vetoes-un-resolution-ceasefire-israel-gaza

న్యూయార్క్‌: గాజాలో తక్షణమే కాల్పుల విరమణ పాటించాలని కోరుతూ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో అరబ్‌ దేశాల మద్దతుతో అల్జీరియా మంగళవారం ప్రవేశపెట్టిన తీర్మానాన్ని అమెరికా వీటో చేసింది. దీంతో బైడెన్‌ ప్రభుత్వ అసలు నైజం మరోసారి బయటపడింది. కాల్పుల విరమణ పాటించాలని తాను చెబుతున్నా నెతన్యాహు వినడం లేదన్నట్టు పోజు పెట్టిన బైడెన్‌ ప్రభుత్వం భద్రతా మండలిలో ఈ తీర్మానాన్ని అడ్డుకోవడం ద్వారా తన అసలు రంగును బయటపెట్టుకుంది. ఇందుకు అది చెప్పిన కారణం చాలా విడ్డూరంగా ఉంది. సున్నితమైన చర్చలను అనిశ్చితిలోకి నెట్టడం ఇష్టం లేకనే ఈ తీర్మానానికి తాము మద్దతు ఇవ్వలేమని చెప్పింది. అంతటితో ఆగలేదు. తీర్మానం ఓటింగ్‌కు పెట్టిన తీరు బాధ్యతారాహిత్యమని ఐరాసలో అమెరికా రాయబారి లిండా థామన్‌ గ్రీన్‌ఫీల్డు పేర్కొన్నారు. అల్జీరియా ప్రతిపాదించిన ఆ తీర్మానంలో ఏమున్నదంటే, గాజాలో పౌరుల ప్రాణాలను కాపాడేందుకు అంతర్జాతీయ చట్టాలను ఇజ్రాయిల్‌, హమాస్‌ రెండూ పాటించాలని, పాలస్తీనా పౌరులను బలవంతంగా ఖాళీ చేయించడాన్ని తిరస్కరించాలని చెప్పింది. అలాగే అక్టోబర్‌7న హమాస్‌ దాడి చేసి బందీలుగా పట్టుకెళ్లిన వారిని బేషరతుగా విడుదలజేయాలని కోరింది. ఇజ్రాయిల్‌ ఏకపక్షంగా సాగిస్తున్న దురాక్రమణపూరిత యుద్ధంలో ఇంతవరకు 29,092 మంది చనిపోయారు. వీరిలో మూడింట రెండొంతుల మంది మహిళలు, పిల్లలేనని గాజా ఆరోగ్య మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

➡️