నేవీ మాజీ చీఫ్‌ అడ్మిరల్‌ రామ్‌దాస్‌ కన్నుమూత

న్యూఢిల్లీ : భారత నేవీ మాజీ చీఫ్‌, మానవ హక్కుల కార్యకర్త ఆడ్మిరల్‌ లక్ష్మీనారాయణ రామ్‌దాస్‌ శుక్రవారం కన్నుమూశారు. ఆయన వయస్సు 90 ఏళ్లు. సుమారు 50 ఏళ్ల పాటు భారత నేవీకి ఆయన సేవలు అందించారు. 1971 బంగ్లాదేశ్‌ లిబరేషన్‌ వార్‌లో కీలక పాత్ర పోషించారు. ఆ యుద్ధ సమయంలో ఐఎన్‌ఎస్‌ బీయాస్‌కు కమాండర్‌గా ఉన్నారు. తూర్పు పాకిస్థాన్‌ (ప్రస్తుత పాకిస్థాన్‌) నుంచి వచ్చే యుద్ధ నౌకలను బీయాస్‌ సమర్థవంతంగా అడ్డుకుంది. బంగ్లాదేశ్‌ స్వాతంత్య్రం సాధించడంలో భారత్‌ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. 1949లో టీనేజర్‌గా ఉన్న సమయంలో భారత సైన్యంలో రామ్‌దాస్‌ చేరారు. 15 ఏళ్ల వయస్సులో క్యాడెట్‌గా చేరారు. 1990 నవంబర్‌ 30న నేవీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించారు. 1993లో పదవీ విరమణ చేశారు. మానవ హక్కుల కార్యకర్తగానూ పనిచేశారు. ముఖ్యంగా అణు ఆయుధాల ముప్పును తగ్గించడానికి కృషి చేశారు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో పర్యటించి అణు నిరాయుధీకరణ వైపు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

➡️