బిజెపికి మరో భంగపాటు

Feb 20,2024 22:01 #judgement, #supreem court

– ఛండీగఢ్‌ మేయర్‌ ఎన్నికను రద్దు చేసిన సుప్రీంకోర్టు

– ఆప్‌ కౌన్సిలర్‌ కులదీపే అసలైన విజేతగా నిర్ధారణ

– రిటర్నింగ్‌ అధికారికి షోకాజ్‌ నోటీసులు

న్యూఢిల్లీ : ప్రజాస్వామ్య వ్యవస్థను, రాజ్యాంగ విలువలను కాలరాస్తున్న బిజెపికి సర్వోన్నత న్యాయస్థానంలో మరోమారు భంగపాటు ఎదురైంది. ఛండీగఢ్‌ మేయర్‌ ఎన్నిక సందర్భంగా చోటుచేసుకున్న అక్రమాలను ధర్మాసనం తీవ్రంగా ఆక్షేపించింది. ఇది ప్రజాస్వామ్య విధ్వంసమేనని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అప్రజాస్వామిక రీతిలో నిర్వహించిన ఈ ఎన్నిక ఫలితాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అలాగే ఆమాద్మీ పార్టీ (ఆప్‌) కౌన్సిలర్‌ కుల్‌దీప్‌ కుమార్‌ ఈ ఎన్నికలో అసలైన విజేతగా నిలిచారని పేర్కొంది. ఆయనే మేయర్‌గా ఎన్నికైనట్లు ధర్మాసనం ప్రకటించింది. ఛండీగఢ్‌ మేయర్‌ ఎన్నికల్లో పోలింగ్‌ వీడియోను చూసిన తర్వాత ప్రధానన్యాయమూర్తి జస్టిస్‌ డివై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం ఈ తీర్పు వెలువరించింది. కిందిస్థాయిల్లో ప్రజాస్వామ్యాన్ని ఎలా విధ్వంసం చేస్తున్నారో ఈ ఉదంతం తెలియజేస్తోందని ఆందోళన వ్యక్తం చేసింది. ఎన్నికల రిటర్నింగ్‌ ఆఫీసర్‌ పదవిని దుర్వినియోగం చేయడం ద్వారా ఎన్నికల ఫలితాలను మార్చేందుకు ప్రయత్నించిన తీరును సుప్రీంకోర్టు తీవ్రంగా నిరసించింది. రాజ్యాంగంలోని 142వ అధికరణ కింద తనకు గల అసాధారణ అధికారాలతో మేయర్‌ ఎన్నికను రద్దు చేసి..కులదీప్‌ను విజేతగా ప్రకటిస్తున్నామని ధర్మాసనం స్పష్టం చేసింది. రిటర్నింగ్‌ అధికారి అనీల్‌ మాసీ ఉద్దేశ్యపూర్వకంగానే ఎనిమిది బ్యాలెట్‌ పత్రాల్లో మార్పులు చేసేందుకు ప్రయత్నించారని నిర్ధారించింది. బిజెపి అభ్యర్ధి మనోజ్‌ సోన్‌కర్‌కు అనుకూలంగా ఎన్నికల ఫలితాలు వచ్చేలా ఫలితాన్ని తారుమారు చేశారని ఆక్షేపించింది. తన వద్దకు వచ్చేసరికే ఆ బ్యాలెట్‌ పత్రాలు దిద్ది వున్నాయంటూ సోమవారం రిటర్నింగ్‌ అధికారి తప్పుడు ప్రకటన చేశారని కూడా కోర్టు పేర్కొంది. ఆయనకు షోకాజ్‌ నోటీసు జారీ చేస్తూ, క్రిమినల్‌ చర్యలు ఎందుకు తీసుకోరాదో తెలియచేయాలని మూడు వారాల గడువు ఇచ్చింది. మేయర్‌ ఎన్నికలో అవకతవకలకు పాల్పడ్డారంటూ రిటర్నింగ్‌ అధికారి అనీల్‌ పై కుల్‌దీప్‌ కుమార్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన అనంతరం సుప్రీంకోర్టు పై తీర్పు ఇచ్చింది. ఆప్‌ అభినందనలుసర్వోన్నత న్యాయస్థానం తీర్పుతో మేయర్‌గా ఎన్నికైన కుల్‌దీప్‌ కుమార్‌కు ఆప్‌ చీఫ్‌, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రివాల్‌ అభినందనలు తెలిపారు. భారత ప్రజాస్వామ్యం, గౌరవప్రదమైన సుప్రీం కోర్టు తీర్పు వల్లనే ఇది సాధ్యమైందని సామాజిక మాధ్యమాల్లో ఆయన పోస్టు చేశారు. ప్రజాస్వామ్యంలోని నిష్పాక్షికతను, స్వయంప్రతిపత్తి సంస్థలను ఎలాంటి పరిస్థితుల్లోనైనా పరిరక్షించుకోవాలని ఆయన కోరారు.

➡️