గాజాలో అమానవీయతకు 100 రోజులు

Jan 15,2024 07:42 #gaja, #inhumanity

-యుద్ధం మధ్యప్రాచ్యం అంతటా వ్యాపించింది

-లెబనాన్‌, ఇరాన్‌, యెమెన్లలో దాడులు

-ఎర్ర సముద్రం కూడా రణరంగంగా మారింది

గాజా:గాజాలో ప్రతి గంటకు 10 మంది చనిపోతున్నారు.లక్షలాది మంది నిరాశ్రయులయ్యారుగాజా సామూహిక సమాధిగా మారి ఆదివారానికి సరిగ్గా100 రోజులు. ఇది ఈ శతాబ్దపు అత్యంత అమానవీయ చర్య. ఈ వంద రోజుల్లో 24వేల మంది దాకా పాలస్తీనీయులు చనిపోయారు. మరో 60,000 మంది దాకా క్షతగాత్రులయ్యారు. చనిపోయినవారిలో ఎక్కువ భాగం అభం శుభం తెలియని పిల్లలు, మహిళలే. ఆసుపత్రులు, క్రైస్తవ, ముస్లిం ప్రార్థనా స్థలాలను ధ్వంసం చేస్తూ యుద్ధ నేరాలకు పాల్పడుతున్న ఇజ్రాయెల్‌.. తాము గాజా నుంచి ఉపసంహరించుకునేందుకు సిద్ధంగా లేమని అంతర్జాతీయ న్యాయస్థానం ఎదుట చెప్పింది. అక్టోబర్‌ 7న హమాస్‌ దాడిని సాకుగా చూపి ఇజ్రాయెల్‌ ఏకపక్షంగా చేపట్టిన దురాక్రమణపూరిత దాడులు సాగిస్తోంది. గాజాలో రక్తపుటేరులు పారిస్తోంది. యూదు ఉన్మాది నెతన్యాహు ఈ యుద్ధాన్ని ఆత్మ రక్షణ చర్యగా పేర్కొన్నారు. ఇజ్రాయిల్‌ ను యుద్ధ నేరస్తునిగా ప్రకటించాలని దక్షిణాఫ్రికా అంతర్జాతీయ న్యాయస్థానంలో పిటిషన్‌ వేసింది. 76 ఏళ్లుగా పాలస్తీనా ప్రజలు ఇజ్రాయిల్‌ దాష్టీకాలకు, దురాక్రమణలకు గురవుతూనే ఉన్నారని దక్షిణాఫ్రికా ఆ పిటిషన్‌లో పేర్కొంది. 21వ శతాబ్దపు అత్యంత దారుణమైన మారణహౌమానికి గాజా నగరం ప్రత్యక్ష సాక్షిగా నిలిచింది. జియోనిస్ట్‌ రాబందులు రక్తదాహంతో తిరుగుతున్నాయి. అ మెరికా ఈ రాబందులకు అన్ని రకాల మద్దతు ఇస్తున్నది. పశ్చిమ దేశాలు అండ చూసుకునే ఇజ్రాయిల్‌ ఇష్టానుసారంగా చెలరేగిపోతోంది. రాక్షస దాడులను యథేచ్ఛగా సాగిస్తోంది.. గాజాలో కాల్పుల విరమణకు అంతర్జాతీయ సమాజం ముక్త కంఠంతో చేస్తున్న డిమాండ్‌ను యుద్ధోన్మాది నెతన్యాహు బేఖాతరు చేస్తున్నాడు. ప్రపంచం భయపడుతున్నట్టే ఈ యుద్ధం మధ్యప్రాచ్యం అంతటికీ విస్తరిస్తోంది. లెబనాన్‌, ఇరాన్‌, యెమెన్‌లపై సామ్రాజ్యవాద అమెరికా, బ్రిటన్‌ తాజాగా వైమానిక దాడులకు దిగాయి. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే ఎర్ర సముద్రం , హిందూ మహాసముద్రం కూడా రణరంగంగా మారాయి. ఇరాన్‌ మద్దతుతో యెమెన్‌ హౌతీలు ఎర్ర సముద్రంలో ఇజ్రాయెల్‌ అనుబంధ నౌకలపై దాడి చేశారు. యెమెన్‌లోని హౌతీ స్థావరాలపై అమెరికా, బ్రిటన్‌ శుక్రవారం పెద్దయెత్తున వైమానిక దాడులు ప్రారంభించాయి.ఇది మున్ముందు ఎటువంటి మలుపు తీసుకుంటుందో వేచి చూడాలి.

➡️