ఘోర ఘటన – పెళ్లి బృందం ట్రాక్టరు బోల్తాపడి 13మంది మృతి

రాజ్‌గఢ్‌ (మధ్యప్రదేశ్‌) : మధ్యప్రదేశ్‌లో ఆదివారం రాత్రి ఘోర ఘటన జరిగింది. పెళ్లి బృందం ట్రాక్టరు బోల్తాపడి 13మంది మృతి చెందారు. మరో 15మంది గాయపడ్డారు. మృతుల్లో నలుగురు చిన్నారులు ఉన్నారు.

మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్‌ జిల్లాలో నిన్న రాత్రి 8 గంటల సమయంలో రాజగఢ్‌ పిప్లోడి వద్ద ఓ వివాహ ఊరేగింపులో ప్రమాదవశాత్తూ ట్రాక్టర్‌ బోల్తా పడింది. ఈ ఘటనలో 13మంది మృతి చెందగా, మరో 15మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. రాజస్థాన్‌లోని మోతీపురా నుంచి కులంపూర్‌కు ఊరేగింపుగా వెళుతున్న క్రమంలో ట్రాక్టర్‌ బోల్తా పడినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదంలో గాయపడినవారందరినీ వెంటనే జిల్లా ఆసుపత్రికి తరలించారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని, వారిని భోపాల్‌ ఆసుపత్రికి తరలించినట్లు జిల్లా కలెక్టర్‌ హర్ష్‌ దీక్షిత్‌ చెప్పారు. పొరుగున ఉన్న రాజస్థాన్‌ నుంచి ఈ పెళ్లిబఅందం వచ్చినట్లు స్థానికులు తెలిపారు. మఅతి చెందినవారిలో రాజస్థాన్‌కు చెందినవారు ఉన్నట్లు తెలుస్తుంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సిఎం మోహన్‌యాదవ్‌ స్పందన…
ఈ ఘటనపై మధ్యప్రదేశ్‌ సిఎం మోహన్‌యాదవ్‌ స్పందించారు. ” రాజస్థాన్‌ ప్రభుత్వం, పోలీసులతో టచ్‌లో ఉన్నాం… రాజస్తాన్‌ పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకున్నారు. గాయపడినవారు రాజగఢ్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మరి కొంతమందిని భోపాల్‌ తరలించాం” అని ఎక్స్‌లో తెలిపారు.

➡️