పోరాట నామ సంవత్సరం

2023 round up protest year

2023 రౌండప్‌

న్యూఢిల్లీ : కాలగర్భంలో మరొక ఏడాది కలిసిపోయింది. 2023 గత జ్ఞాపకంగా మిగిలిపోయింది. అయితే 2023ను పోరాట నామ సంవత్సరంగా మనకు గుర్తుండి పోతుంది. కేంద్రంలో ప్రధానమంతి నరేంద్ర మోడీ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా,కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలకు నిరసనగా దేశవ్యాప్తంగా 2023లో అనేక ప్రజా పోరాటాలు, ఆందోళనలు జరిగాయి. ఈ ఐక్య పోరాటానికి మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించే పూర్తి శక్తి ఉంది. అలాగే కేంద్ర దర్యాప్తు సంస్థలను మోడీ ప్రభుత్వం పావులుగా ఉపయోగించుకోవడంపైనా పోరాటాలు ఉధృతమ య్యాయి. భారత రెజ్లింగ్‌ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్‌ లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా రెజ్లర్లు పోరాటానికి దిగారు. సుమారు మూడు నెలల ఆందోళన తరువాత బ్రిజ్‌భూషణ్‌ను కేంద్రం తొలగించింది. 2023లో జరిగిన కొన్ని ముఖ్యమైన రాజకీయ పరిణామలు..

 

  • జర్నలిస్టులపై దాడులు

ప్రతిపక్ష నేతలతో పాటు తమకు వ్యతిరేకంగా గళం వినిపిస్తున్న ఉద్యమకారులు, జర్నలిస్టులపై మోడీ ప్రభుత్వం నిరంకుశ దాడులకు పాల్పడింది. అక్టోబర్‌లో ఢిల్లీ పోలీసులు సమారు 50 మంది జర్నలిస్టులు, రచయితల ఇళ్లపై దాడులు చేశారు. ‘న్యూస్‌క్లిక్‌’ వెబ్‌సైట్‌ ఎడిటర్‌ ప్రబీర్‌ పుర్కాయస్థ, న్యూస్‌ మీడియా అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ అమిత్‌ చక్రవర్తిలను అరెస్ట్‌ చేశారు. వీరిద్దరిపై ఉపా చట్టం కింద కేసు బనాయించింది. జర్నలిస్టుల ఇళ్లపై దాడులు చేసి ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లు, మొబైల్‌ ఫోన్లు పోలీసులు ఎత్తుకెళ్లారు. రాజధాని ఢిల్లీలోనే కాదు ఏకంగా 5 నగరాల్లో దాదాపు యాభై చోట్ల పోలీసులు దాడులు చేశారు. ఎడిటర్స్‌ గిల్డ్‌తో సహా అనేక జర్నలిస్టుల సంస్థలు ఈ ఆపరేషన్‌ను ప్రజాస్వామ్యం, పత్రికా స్వేచ్ఛపై దాడిగా అభివర్ణించాయి.

 

  • ఫోన్లపైనా..నిఘా

మోడీ ప్రభుత్వం ప్రతిపక్ష నాయుకులను, జర్నలిస్టులను వేధించడంతో వారి ఫోన్లను స్పైవేర్‌తో నిఘా ఉంచుతుందనే వార్తలు 2023లో వెలుగు చూడ్డం పెద్ద ఎత్తున కలకలం రేపింది. సంవత్సర ప్రారంభంలో ఇలాంటి వార్తలు వచ్చాయి. చివరిలో కూడా సీతారాం ఏచూరి, రాహుల్‌ గాంధీ, శశి థరూర్‌ వంటి ప్రతిపక్ష నేతల ఫోన్‌లు హ్యాక్‌ అవుతున్నాయని ఐఫోన్‌ తయారీ సంస్థ యాపిల్‌ నుంచి హెచ్చరికలు అందాయి. ప్రభుత్వ ఆధ్వర్యంలోని హ్యాకర్లు ఈ పని చేస్తున్నారని, ఎవరు ఏం చేస్తారో తెలుసుకోవడానికి ఫోన్‌లను హ్యాక్‌ చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఐఫోన్‌ హెచ్చరించినట్లు ఈ నాయుకులు తెలిపారు. సంవత్సరంలో ముందుగా వచ్చిన పెగాసస్‌ స్పైవైర్‌ ఆరోపణలపై మోడీ ప్రభుత్వం ఇప్పటి వరకూ సమాధానం చెప్పలేదు. ఇక ఐఫోన్‌ హ్యాకింగ్‌ ఆరోపణలుపై అస్సలు స్పందించనేలేదు.

2023 round up protest year

  • ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌

2023లో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఎఐ) వార్తల్లోని నిలిచిన మరోక ముఖ్యమైన అంశం. అయితే ఈ ఎఐ కొత్త ఆశలను, భయాలను రెండింటినీ పెంచింది. 2023లో భారతదేశపు మొట్టమొదటి కృత్రిమ మేధస్సుతో నడిచే న్యూస్‌ రీడర్‌ ఒక టెలివిజన్‌ ఛానెల్‌లో దర్శనమిచ్చి అందరి దృష్టిని ఆకర్షించింది. దీంతో ఇప్పటికే మందగమనంలో ఉన్న ఆర్థిక వ్యవస్థలో ఉపాధి అవకాశాలు తగ్గిపోతున్నా యని, ఎఐ విసృత్త ఉపయోగంతో కొన్ని రంగాల్లో అవకాశాలు మరింత మృగ్యమవుతాయని ఆందోళనలు పెరిగాయి. అయితే ఎఐతో కొన్ని ఉద్యోగాలు పెరుగుతాయని నిపుణులు అంటున్నారు.

 

  • 17 రోజలు సొరంగంలోనే.

ఉత్తరాఖండ్‌లోని సిల్కియారా సొరంగంలో 17 రోజులు పాటు 41 మంది కార్మికులు చిక్కుకుని ఉండటం అందర్ని ఆందోళనకు గురిచేసింది. అయితే వీరిని ఎట్టేకేలకు సురక్షితంగా బయటకు తీసుకుని రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే అత్యాధునిక యంత్రాలు, ఆగర్‌ మెషిన్లు, ఉన్నత చదువులు చదివిన ఉద్యోగులు చేయలేని పనిని ర్యాట్‌ హోల్‌ వర్కర్లు చేశారు. సొరంగంలో చిక్కుక్కుపోయిన కార్మికులను కాపాడారు. ఈ క్షణాలను దేశం మొత్తం ఆత్రుతగా చూసింది, మతం, భాష, కుల భేదాలను చెరిపివేసి ర్యాట్‌ వర్కర్లు సొరంగం లోపల నుండి వారిని ఒక్కొక్కరుగా బయటకు తీసుకువచ్చారు.

 

  • 146 మంది ఎంపీలపై వేటు

భారత పార్లమెంట్‌ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మోడీ ప్రభుత్వం ఏకంగా ఈ ఏడాది 146 మంది ఎంపిలపై బహిష్కరణ వేటు వేసింది. ప్రభుత్వాన్ని ప్రశ్నించడం, న్యాయమైన డిమాండ్లు చేయడమే ఈ 146 మంది ఎంపిల నేరమయింది. ప్రతిపక్ష ఎంపీల ప్రవర్తనను ‘అన్‌పార్లమెంటరీ బిహేవియర్‌’గా ఆరోపిస్తూ మోడీ ప్రభుత్వం ఈ వేటు వేసింది. అయితే వివాదాస్పద బిల్లులను ఆమోదింపజేసుకునేందుకు, వ్యతిరేక స్వరాలకు అడ్డుకట్ట వేసేందుకు మోడీ ప్రభుత్వం ఈ వ్యూహం పన్నినట్లు విమర్శలు వెల్లువెత్తాయి. ప్రతిపక్ష పార్టీలు దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తం చేశాయి. అయితే తమ ఎంపీని సస్పెండ్‌ చేసినా తృణమూల్‌ కాంగ్రెస్‌ ఈ నిరసనల్లో పాల్గొనలేదు.

 

  • బాలేశ్వర్‌లో ఘోర రైలు ప్రమాదం

జూన్‌లో ఒడిశాలోని బాలేశ్వర్‌లో జరిగిన ఘోర రైలు ప్రమాదంతో దేశం ఒక్కసారిగా ఉల్కిపడింది. ఈ రైలు ప్రమాదంలో 300 మందికి పైగా ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో మూడు రైళ్లు ఒకదానికొకటి ఢకొీన్నాయి. చెన్నై వెళ్తున్న కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌, హౌరా వెళ్తున్న యశ్వంత్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌, ఒక సరుకు రవాణా రైలు కొన్ని నిమిషాల వ్యవధిలోనే ఒకే లైన్‌లో ప్రమాదానికి గురికావడంతో రైల్వే భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

2023 round up protest year

  • పార్లమెంట్‌లో భద్రతా వైఫల్యం

అంత్యకట్టుదిట్టమైన భద్రత ఉండే పార్లమెంట్‌లో భద్రతా వైఫల్యం చోటు చేసుకోవడం 2023లో మరొక ముఖ్యమైన ఘటన. అదీ కూడా పార్లమెంట్‌పై ఉగ్రవాదుల దాడి జరిగి 22 ఏళ్లు పూర్తయిన రోజున ఇద్దరు యువకులు లోక్‌సభ ప్రేక్షకుల గ్యాలరీ నుంచి ఎంపీల సీట్లపైకి హఠాత్తుగా దూకారు. వారు డబ్బాలో నుండి పసుపు రంగు పొగను స్ప్రే చేశారు. ఈ సంఘటనతో ఎంపీలు, పార్లమెంట్‌ సిబ్బంది ముందుగా ప్రాణభయంతో పరుగులు తీశారు. అయితే కొంతమంది ఎంపీలు ఈ ఇద్దరు యువకులను బంధించారు. పట్టుబడిన సాగర్‌ శర్మ, మనోరంజన్‌ అనే ఇద్దరు యువకులు బిజెపి ఎంపీ ప్రతాప్‌ సింహ ‘పాస్‌’తో లోక్‌సభ గ్యాలరీకి ప్రవేశించారు. ఏదీమైనా ఈ ఘటన కొత్త పార్లమెంట్‌ భవనం వద్ద భద్రతా లోపాలను ఎత్తిచూపింది.

➡️