16వ ఆర్థిక సంఘానికి 3 జాయింట్‌ సెక్రటరీ స్థాయి పోస్టులు

Jan 19,2024 11:13 #16th Finance Commission

కేంద్ర మంత్రివర్గం ఆమోదం

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : 16వ ఆర్థిక సంఘానికి సంబంధించి జాయింట్‌ సెక్రటరీ స్థాయిలో మూడు పోస్టులకు కేంద్ర మంత్రివర్గం గురువారం ఆమోదించింది. అందులో జాయింట్‌ సెక్రటరీ రెండు పోస్టులు, ఆర్థిక సలహాదారు ఒక పోస్టు ఉన్నాయి. 2023 డిసెంబరు 31 నాటి నోటిఫికేషన్‌తో రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 280 ప్రకారం ఏర్పాటైన కమిషన్‌కు సహాయం చేయడానికి కొత్తగా సృష్టించబడిన ఈ పోస్టులు అవసరం అని ప్రభుత్వం తెలిపింది. డిసెంబరు 31న కమిషన్‌ ఛైర్మన్‌గా అరవింద్‌ పనగారియాను కేబినెట్‌ నియమించిన తరువాత ఈ నిర్ణయం తీసుకుంది.పనగారియా గతంలో ఆసియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ (ఎడిబి)లో చీఫ్‌ ఎకనామిస్ట్‌గా ఉన్నారు. నీతి ఆయోగ్‌ మొదటి వైస్‌ ఛైర్మన్‌గా ఉన్నారు. కమిషన్‌ కార్యదర్శిగా రెవెన్యూశాఖ సంయుక్త కార్యదర్శి రిత్విక్‌ రంజనం పాండే నియమితులయ్యారు. 16వ ఆర్థిక సంఘం కేంద్ర, రాష్ట్రాల మధ్య పన్నుల భాగస్వామ్యానికి సంబంధించిన సిఫార్సులు, పంచాయతీలు, మున్సిపాలిటీల వనరులకు అనుబంధంగా రాష్ట్రాల ఏకీకృత నిధిని పెంచడానికి అవసరమైన చర్యలు, విపత్తు నిర్వహణ కార్యక్రమాల ఫైనాన్సింగ్‌, మరిన్నింటిని సమీక్షించే పనిలో ఉంది. ఏప్రిల్‌ 2026 నుంచి 2031 వరకు ఐదేళ్ల కాలానికి సంబంధించిన నివేదికను 2025 అక్టోబరు 31 నాటికి సమర్పించాలని కోరింది. ప్రస్తుతం రాజ్యసభలో బిజెపి సీనియర్‌ ఎంపిగా ఉన్న ఎన్‌కె సింగ్‌ అధ్యక్షతన ఉన్న 15వ ఆర్థిక సంఘం, 2021 నుంచి 2026 వరకు విభజించదగిన పన్ను పూల్‌లో 41 శాతం వాటాను రాష్ట్రాలకు ఇవ్వాలని సిఫార్సు చేసింది.

➡️