క్యాన్సర్‌ నివారణలో ‘ఆశా కిరణం’

  • తొలి స్వదేశీ సిఎఆర్‌ టి సెల్‌ థెరపీ ఆవిష్కరణ

ముంబయి : క్యాన్సర్‌ నివారణ కోసం కొత్త ఆశాకిరణం ఉదయించింది. దేశంలో తొలిసారి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన సిఎఆర్‌ టి సెల్‌ థెరపీని (జన్యు కణాధారిత చికిత్స పద్ధతి) గురువారం నాడు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆవిష్కరించారు. ముంబయిలోని పొవారులో ఉన్న ఐఐటి-బాంబే ప్రాంగణంలో ఈ మేరకు నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్రపతి మాట్లాడుతూ..క్యాన్సర్‌ మహ్మారిని ఎదుర్కొవడంలో మానవజాతికి కొత్త ఆశాకిరణమని, ఇది గొప్ప మైలురాయి అని శాస్త్రవేత్తల కృషిని కొనియాడారు.
ఐఐటి బాంబే, టాటా మెమోరియల్‌ సెంటర్‌ సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఈ జన్యు ఆధారిత చికిత్స పద్ధతి వివిధ రకాల క్యాన్సర్ల నివారణకు వినియోగించనున్నారు. క్యాన్సర్‌ నివారణ ఖర్చును కూడా ఈ చికిత్సా పద్ధతి గణనీయంగా తగ్గించేవీలుందని వైద్య నిపుణులు తెలిపారు.
టాటా మెమోరియల్‌ సెంటర్‌ డైరెక్టర్‌ సుదీప్‌ గుప్తా మాట్లాడుతూ..దేశం వెలుపుల అందుబాటులో ఉన్న సిఎఆర్‌ టి సెల్‌ థెరపీ చాలా ఖరీదైన చికిత్సా పద్ధతి అని, దాని తరహాలోనే దేశీయంగా అభివృద్ధి చేసిన నెక్స్‌ సిఎఆర్‌ 19 అత్యంత చౌక ధరకు అందుబాటులోకి వస్తుందని తెలిపారు. సిఎఆర్‌ టి సెల్‌కు అయ్యే ఖర్చులో పదో వంతు ఖర్చుతోనే నెక్స్‌ సిఎఆర్‌ 19 చికిత్స చేయించుకోవచ్చునని తెలిపారు.

➡️