రూ.40 వేల కోట్ల స్కామ్‌

Dec 30,2023 11:03 #Rs.40 thousand crores, #scam
  • కోవిడ్‌ సమయంలో యడ్యూరప్ప ప్రభుత్వ అవినీతిపై బిజెపి ఎమ్మెల్యే ఆరోపణలు

బెంగళూరు : కోవిడ్‌ మహమ్మారి సమయంలో వైరస్‌ను ఎదుర్కొనే పేరుతో అప్పటి ముఖ్యమంత్రి బిఎస్‌ యడ్యూరప్ప రూ.40 వేల కోట్ల స్కామ్‌కు పాల్పడ్డారని బిజెపికే చెందిన విజయపుర ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్‌ యత్నాల్‌ ఆరోపించారు. ‘ కోవిడ్‌ సమయంలో ఎన్ని వేల కోట్ల రూపాయల దోపిడి జరిగిందో మీకు తెలుసా.? కోవిడ్‌ పేరు చెప్పి రూ.40 వేల కోట్లు కొల్లగొట్టారు’ అని యత్నాల్‌ శుక్రవారం ఇక్కడ విలేకరులకు తెలిపారు. ‘రూ.45 ఖరీదు ఉండే మాస్కును కోవిడ్‌ సమయంలో రూ.485 ఖరీదుతో అప్పటి ప్రభుత్వం కొనుగోలు చేసింది’ అని యత్నాల్‌ ఆరోపించారు. ‘బెంగళూరులో 10 వేల పడకలతో ఆసుపత్రి ఏర్పాటు చేశామని అప్పటి బిజెపి ప్రభుత్వం ప్రకటించింది. ఈ పడకలు (బెడ్లు) అన్నీ అద్దెకు తీసుకొన్నవే. ఒక పడకను అద్దెకు తీసుకున్న ధరతో రెండు పడకలను కొనుగోలు చేయవచ్చును. ఒక పడకకు రోజుకు రూ.20 వేల అద్దె చెల్లించారు. రూ 20 వేలతో సెలైన్‌ స్టాండ్లు ఉన్న రెండు మంచాలు కొనుగోలు చేయవచ్చు’ అని యత్నాల్‌ తెలిపారు. కరోనా విజృంభణ సమయంలో అంటే 2019 జులై నుంచి 2021 జులై వరకూ కర్ణాటక ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప పదవిలో ఉన్నారు.

బిజెపి హయాంలో అవినీతికి యత్నాల్‌ వ్యాఖ్యలే రుజువు

కోవిడ్‌ సమయంలో భారీ అవినీతి జరిగిందనడానికి బిజెపి ఎమ్మెల్యే యత్నాల్‌ వ్యాఖ్యలే రుజువని ప్రస్తుత ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు. యడ్యూరప్ప ప్రభుత్వం రూ. 4 వేల కోట్ల స్కామ్‌కు పాల్పడిందని కాంగ్రెస్‌ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఆరోపించిన విషయాన్ని సిద్ధరామయ్య గుర్తు చేశారు.

బహిష్కరించే ప్రయత్నం చేస్తే ఆధారాలు బయటపెడతా : యత్నాల్‌

ఆరోపణలు చేసిన యత్నాల్‌పై బహిష్కరణ వేటు వేయాలని కొంతమంది బిజెపి నాయుకులు అధిష్టానాన్ని డిమాండ్‌ చేశారు. దీనికి యత్నాల్‌ స్పందిస్తూ ‘వారు (బిజెపి ప్రభుత్వం) ప్రతీదీ అవినీతి చేశారు. బిజెపి వారు నాకు నోటీసు ఇవ్వనివ్వండి, పార్టీ నుంచి నన్ను బహిష్కరించడానికి ప్రjత్నం చేయనివ్వండి. అప్పుడు ఆధారాలన్నీ బయటపెడతాను’ అని హెచ్చరించారు.

➡️