జర్నలిస్టుల హత్యల్లో మూడో వంతు అక్కడే

Apr 16,2024 00:18 #cpj, #journalists, #murders
  • భారత్‌లోనూ అదే పరిస్థితి
  •  సిపిజె నివేదిక వెల్లడి

న్యూఢిల్లీ : గత ఏడాది ప్రపంచవ్యాప్తంగా 99 మంది జర్నలిస్టులు, మీడియా ఉద్యోగులు హత్యగావించబడ్డారు. కాగా, వీరిలో మూడోవంతు మంది గాజాపై ఇజ్రాయిల్‌ దాడుల్లో బలైనవారే. ఇవన్నీ గాజాపై ఇజ్రాయిల్‌ దాడులు ప్రారంభించిన మొదటి మూడు నెలల్లో చోటుచేసుకున్నాయి. . ఆ తరువాత ఇంకా అనేక మంది చనిపోయారు. జర్నలిస్టుల పరిరక్షణ కమిటీ (సిపిజె) సోమవారం ఈ మేరకు ఒక నివేదికను విడుదలజేసింది. ఒక ఏడాదిలో ఒక దేశంలో చోటుచేసుకున్న హత్యల కంటే ఇవి ఎక్కువ అని తెలిపింది. గాజాలో జర్నలిస్టులపైన, సాధారణ పౌరులపైన పెద్దయెత్తున దాడులు జరుగుతున్నాయని, ఫలితంగా వేలాది కుటుంబాలు బతుకు జీవుడా అంటూ ప్రాణాలు అరచేతపెట్టుకుని ఇతర ప్రాంతాలకు వలసపోతున్నాయని సిపిజె తెలిపింది. 1997 నుంచి 2023 వరకు సాగిన జర్నలిస్టుల హత్యల గురించి నివేదిక ప్రస్తావించింది. జర్నలిస్టులు ఎక్కువగా హత్యలకు గురవుతున్న దేశాల్లో భారత్‌ కూడా ఒకటని తెలిపింది. 2015 నుంచి ఈ హత్యలు బాగా పెరిగిపోయాయని తెలిపింది. కొన్ని దేశాల్లో పాత్రికేయులపై కేసులు, జైలులో నిర్బంధించడం, పత్రికా స్వేచ్ఛపై దాడులు యథేచ్ఛగా సాగిపోతున్నాయని ఆ నివేదిక పేర్కొంది. మిగిలిన ఖండాలతో పోలిస్తే ఆసియాలో జర్నలిస్టులు అధిక సంఖ్యలో జైల్లో ఉన్నారని తెలిపింది. గత ఏడాదిలో భారత్‌లో ఏడుగురు జర్నలిస్టులను జైల్లో పెట్టారని, వీరిపై ఉపాతో సహా ప్రజా భద్రతా చట్టాలను ప్రయోగించారని సిపిజె ఆందోళన వ్యక్తం చేసింది.

➡️