అదానీ కేసు: సుప్రీం తీర్పు నిరాశపరిచింది:సిపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో

Jan 3,2024 21:50 #judgement, #Supreme Court

న్యూఢిల్లీ : అడాని కేసులో నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను తిరస్కరిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నిరాశపరిచిందని సిపిఐ(ఎం) విమర్శించింది. ఏ విధంగా చూసినా ఇది దురదృష్టకరమైన తీర్పు అని పార్టీ పొలిట్‌బ్యూరో బుధవారం నాడిక్కడ విడుదలజేసిన ఒక ప్రకటనలో పేర్కొంది.సుప్రీంకోర్టు విశ్వసనీయతను పెంచే తీర్పుగా దీన్ని చూడలేం. అదానీ గ్రూప్‌పై వచ్చిన ఆరోపణలపై త్వరితగతిన దర్యాప్తు చేయాల్సిన బాధ్యతను సెబీ వంటి చట్టబద్ధంగా నిర్దేశించిన సంస్థ సరిగా నెరవేర్చలేకపోయింది. 2014లో డీఆర్‌ఐ అదానీపై వచ్చిన ఆరోపణలను సెబీకి అప్పగించింది. 2021లో అదానీపై వచ్చిన ఆరోపణలపై సెబీ దర్యాప్తు చేస్తోందని ప్రభుత్వం పార్లమెంటుకు తెలిపింది. అయితే కోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌లో అటువంటి దర్యాప్తు ఏదీ తాను చేపట్టలేదని సెబీ పేర్కొంది. ఫిర్యాదులపై ఎందుకు చర్యలు చేపట్టలేదని సెబీని ప్రశ్నించాల్సింది పోయి, దర్యాప్తు చేయలేదన్న మాటను ఆ సంస్థ ముఖ విలువగా న్యాయస్థానం తీసుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోందని పొలిట్‌బ్యూరో వ్యాఖ్యానించింది. రెండవది, ‘అంతిమ లబ్ధిదారు’ ఎవరో దాచడానికి సెబీ తన సొంత నిబంధనలను సైతం మార్చేసింది. ఇది పారదర్శకతను కుదించివేస్తోంది. ఇటువంటి సవరణలు సెబీ చట్టపరమైన అధికారాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేసే వాతావరణంలో దర్యాప్తు జరిగిందని సుప్రీం కోర్టుచేత నియమించబడిన నిపుణుల కమిటీ కూడా ఎత్తి చూపింది. అయినా, ‘అంతిమ లబ్ధిదారు’ , విదేశీ పెట్టుబడిదారుల మధ్య సంబంధాన్ని దాచడానికి గోడగా మారిన ఈ సవరణలను సుప్రీంకోర్టు ఆమోదించిందని పేర్కొంది.మూడవది, అత్యంత దురదృష్టకరమైనది నిబంధనల ఉల్లంఘన జరిగిందని హిండెన్‌బర్గ్‌ రిసెర్చి చేసిన ఆరోపణలపై దర్యాప్తు చేసి తగు చర్యలు తీసుకోవడానికి బదులు విజిల్‌బ్లోయర్‌నే శిక్షించేలా ప్రభుత్వానికి బహిరంగ లైసెన్స్‌ను ఈ తీర్పు ఇస్తున్నది. ఈ తరహా విధానం హిండెన్‌బర్గ్‌ నివేదికను ప్రచురించిన అన్ని మీడియా సంస్థలను ప్రమాదంలోకి నెడుతుందని పొలిట్‌బ్యూరో పేర్కొంది మొత్తం మీద ఈ తీర్పు సుప్రీం కోర్టు విశ్వసనీయతను పెంచేదిగా లేదని తెలిపింది. .

➡️