ఆకాశ్‌ క్షిపణి పరీక్ష విజయవంతం..

Jan 12,2024 16:24 #Akash Missile, #Odisha

భువనేశ్వర్‌ :   భారత్‌కు  చెందిన రక్షణ పరిశోధన అభివఅద్ధి సంస్థ (డిఆర్‌డిఒ) కొత్త తరం ఆకాశ్‌ క్షిపణి పరీక్షను విజయవంతంగా నిర్వహించింది. ఒడిశా తీరంలోని చండీపూర్‌లోగల ఇంటిగ్రేటెడ్‌ టెస్ట్‌ రేంజ్‌ (ఐటిఆర్‌) నుండి ఈ క్షిపణిని ప్రయోగించినట్లు అధికారులు శుక్రవారం తెలిపారు. గగనతలంలో చాలా తక్కువ ఎత్తులో అత్యంత వేగంగా దూసుకెళ్లే మానవరహిత లక్ష్యంపై డిఆర్‌డిఒ ఈ ప్రయోగాన్ని నిర్వహించింది. క్షిపణి ఆయుధ వ్యవస్థ విజయవంతంగా అడ్డగించి ధ్వంసం చేసింది.

ఈ పరీక్ష ద్వారా డిఆర్‌డిఒ స్వదేశీయంగా అభివృద్ధి  చేసిన ఆకాశ్‌ క్షిపణి వ్యవస్థలోని రేడియో ఫ్రీక్వెన్సీ సీకర్‌ను, లాంఛర్‌ను, మల్టీ ఫంక్షన్‌ రాడార్‌ అండ్‌ కమాండ్‌, కంట్రోల్‌ను, కమ్యూనికేషన్‌ వ్యవస్థ పనితీరును పరిశీలించింది. డిఆర్‌డిఒ, భారత వైమానిక దళం (ఐఎఎఫ్‌), భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌ (బిడిఎల్‌), భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ (బిఇఎల్‌)కి చెందిన సీనియర్‌ అధికారులు ఈ క్షిపణి పరీక్షలో పాల్గొన్నారు.

ఆకాశ్‌ క్షిపణి పరీక్షను విజయవంతంగా నిర్వహించిన డిఆర్‌డిఒ, ఐఎఎఫ్‌తోపాటు క్షిపణి పరీక్షల ఇండిస్టీని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అభినందించారు.  తాజా పరీక్ష సక్సెస్‌ కావడంతో భారత రక్షణ వ్యవస్థ మరింత బలోపేతమవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

➡️