ఆలయ పరిసరాల్లో ఎన్నికల సభ

Apr 8,2024 07:24 #election meeting, #temple

– బిజెపి నేత ఈశ్వరప్పపై ఇసి కేసు నమోదు
బెంగళూరు : దక్షణాదిలో ఉనికి చాటుకునేందుకు బిజెపి బరితెగిస్తోంది. ఎన్నికల నియమావళిని తుంగలో తొక్కుతోంది. కర్ణాటకకు చెందిన ఆ పార్టీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి కెఎస్‌ ఈశ్వరప్ప ఏకంగా ఒక ఆలయం పరిసరాల్లోనే ఎన్నికల సభ నిర్వహించారు. దీనిపై ఎన్నికల సంఘం కన్నెర్ర చేసింది. సంబంధిత అధికారుల నుంచి ఎటువంటి ముందస్తు అనుమతులు తీసుకోకుండా ఆలయ పరిసరాల్లో ఎన్నికల సమావేశం ఎలా నిర్వహిస్తారంటూ ఆయనపై కేసు నమోదు చేసింది. వాస్తవానికి రాష్ట్ర బిజెపి తీరుపై ఆయన గుర్రుగా ఉంటూవస్తున్నారు. శివమొగ్గులో తనకు టిక్కెట్‌ ఇవ్వకపోతే స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగుతానని ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే నోనాబుర్‌ గ్రామ పంచాయతీ పరిధిలోని అంబుతీర్థ ఆలయ పరిసరాల్లో ఆయన తన అనుచరులతో ఎన్నికల కసరత్తు కోసం ఈ నెల 5న సమావేశం నిర్వహించారు. ఆలయంలోని మైకు, ఇతర సామగ్రిని కూడా వాడుకున్నారు. ఆలయంలోనే ఉన్న పూజారి నివాసంలో జరిగిన ఈ సమావేశంలో 60 మంది పైగా బిజెపి కార్యకర్తలు పాల్గన్నారు. అయితే ఇలాంటి సమావేశాల కోసం జిల్లా ఎన్నికల అధికారి (డిఇఒ) నుంచి ముందస్తుగా అనుమతి తీసుకోవడం తప్పనిసరి. ఈశ్వరప్ప ఎటువంటి అనుమతులు తీసుకోకుండానే సమావేశం నిర్వహించారు. దీంతో ఎన్నికల సంఘం ఆదేశాలతో తాలుకా అధికారులు ఆయనపై కేసు నమోదు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి కార్యాలయం ప్రకటించింది.

➡️