అనంత్‌నాగ్‌ ఎన్నిక వాయిదాపై విమర్శల వెల్లువ

May 2,2024 02:05 #Anantnag, #election, #postponement
  •  ఓటింగ్‌ సరళిని మార్చేందుకే .. : ముఫ్తీ, ఒమర్‌
  •  ఇసి విశ్వసనీయతనే దెబ్బ తీస్తుంది : సిపిఎం

శ్రీనగర్‌ : జమ్ముకాశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌-రాజౌరీ లోక్‌సభ స్థానం ఎన్నికను ఎన్నికల కమిషన్‌ (ఇసి) వాయిదా వేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నెల 7న జరగాల్సిన అనంత్‌నాగ్‌ లోక్‌సభ ఎన్నికను ఈ నెల 25కు ఇసి మంగళవారం వాయిదా వేసింది. ఇసి నిర్ణయాన్ని సిపిఎం తీవ్రంగా వ్యతిరేకించింది. అనంత్‌నాగ్‌ ఎన్నికను వాయిదా వేయిడం ఇసి విశ్వసనీయతను దెబ్బతీస్తుందని సిపిఎం నాయకులు ఎం.వై. తరిగామి విమర్శించారు. ఇసి నిర్ణయంపై పిడిపి చీఫ్‌ మెహబూబా ముఫ్తీ, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ (ఎస్‌సి) ఒమర్‌ అబ్దుల్లా అనేక ప్రశ్నలు సంధించారు. ఓటింగ్‌ సరళిని మార్చే లక్ష్యంతోనే ఇసి ఈ ఎన్నికను వాయిదా వేసిందని విమర్శించారు. ‘అనేక పార్టీల విజ్ఞప్తి మేరకు అనంత్‌నాగ్‌ ఎన్నికను వాయిదా వేస్తున్నట్లు ఇసి ప్రకటించింది. ఇది బిజెపి కుట్ర. ఎన్నిక వాయిదా విషయంలో అభ్యర్థులకు, ఓటర్లకు సంబంధం లేదు. బిజెపి దాని మిత్రపక్షాలు మాత్రమే వాయిదా గురించి మాట్లాడుతున్నాయి. మేలో ఎగువ ప్రాంతాలకు వలస వెళ్లే ప్రజలు ఓటింగ్‌లో పాల్గొనకుండా చేయడానికే ఎన్నికను వాయిదా వేశారు. ఓటింగ్‌లో పాల్గొన్న తరువాతే వారంతా వలస వెళతారని నేను నమ్ముతున్నాను’ అని అబ్దుల్లా తెలిపారు.
రాజౌరిలో ఎన్నికల సభలో ముఫ్తీ మాట్లాడుతూ ‘బిజెపి, దాని మిత్రపక్షాలకు అనుకూలంగా ఓటు వేసేందుకు, ఓటు హక్కు వినియోగించుకోకుండా ప్రజలను భయపెట్టేందుకు ఉద్దేశపూర్వకంగానే ఎన్నికలను అధికారులు వాయిదా వేశారు’ అని ముఫ్తీ విమర్శించారు.
ఇసి నిర్ణయానికి వ్యతిరేకంగా శ్రీనగర్‌లో బుధవారం పిడిపి వీధి నిరసన కార్యక్రమం నిర్వహించింది. ఈ నిరసనలో పార్టీ సీనియర్‌ నాయకులు నయీమ్‌ అక్తర్‌ మాట్లాడుతూ ‘ఇది ఎన్నికలకు ముందు జరిగిన రిగ్గింగ్‌. తనకు వ్యతిరేకంగా పరిస్థితి ఉందని బిజెపి గుర్తించింది. దురదృష్టవశాత్తు బిజెపికి ఇసి సాధనంగా మారింది. ఏ నివేదిక ఆధారంగా ఎన్నికలను వాయిదా వేశారో ఆ నివేదికను బహిర్గతం చేయాలి’ అని డిమాండ్‌ చేశారు.
ఇసి నిర్ణయాన్ని బిజెపి, జమ్ముకాశ్మీర్‌ అప్నీ పార్టీ (జెకెఎపి), జమ్ముకాశ్మీర్‌ పీపుల్స్‌ కాన్ఫరెన్స్‌, గులాం నబీ అజాద్‌కు చెందిన డెమొక్రాటిక్‌ ప్రొగ్రెసివ్‌ ఆజాద్‌ పార్టీ (డిపిఎపి) స్వాగతించాయి.

➡️