Arvind Kejriwal కేజ్రివాల్‌కు లభించని ఊరట !

బెయిల్‌పై ఢిల్లీ హైకోర్టు స్టే
న్యూఢిల్లీ : ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రివాల్‌కు ఉపశమనం లభించలేదు. ఎక్సైజ్‌ పాలసీ కేసులో ఆయనను బెయిల్‌పై విడుదల చేయాలని ఈనెల 20న ట్రయల్‌ కోర్టు జారీ చేసిన ఉత్తర్వులపై ఢిల్లీ హైకోర్టు మంగళవారం స్టే విధించింది. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అందజేసిన సమాచారాన్ని ట్రయల్‌ కోర్టు సరిగా సమీక్షించలేదని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. ఆయా పక్షాలు దాఖలు చేసిన వేలాది పేజీలను కూలంకషంగా సమీక్షించడం సాధ్యం కాదని ట్రయల్‌ కోర్టు న్యాయమూర్తి చేసిన కొన్ని వ్యాఖ్యలను హైకోర్టు ఈ సందర్భంగా ప్రస్తావించింది. కోర్టు ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ఎంత మాత్రమూ సమర్ధనీయం కాదని, పైగా కోర్టు ముందుంచిన సమాచారంపై ట్రయల్‌ కోర్టు తన దృష్టిని కేంద్రీకరించలేదని తెలుస్తోందని హైకోర్టు పేర్కొంది. ఇడి పిటిషన్‌ను అనుమతించామని, నిషేధించిన ఉత్తర్వు అమలుపై స్టే విధించామని హైకోర్టు పేర్కొంది. ముఖ్యమంత్రికి మంజూరు చేసిన బెయిల్‌ను సవాలు చేస్తూ ఇడి పిటిషన్‌ వేసింది. పిఎంఎల్‌ఎలోని సెక్షన్‌ 45 ప్రకారం ముఖ్యమంత్రి బెయిల్‌ పిటిషన్‌ను వ్యతిరేకించేందుకు ఇడికి తగిన అవకాశాన్ని ట్రయల్‌ కోర్టు ఇవ్వలేదని అదనపు సొలిసిటర్‌ జనరల్‌ ఎస్‌.వి.రాజు చేసిన వాదనను కూడా హైకోర్టు పరిగణనలోకి తీసుకుంది. దీనిపై హైకోర్టు స్పందిస్తూ, బెయిల్‌పై వాదనలు వినిపించేందుకు ఇడికి తగిన అవకాశాన్ని ఇచ్చి వుండాల్సిందని వ్యాఖ్యానించింది. ఇటువంటి విషయాల్లో వాదనలు పూర్తయిన వెంటనే తీర్పును ఇవ్వాలని, ఇలా రిజర్వ్‌ చేసుకోవడం అసాధారణమని సుప్రీం సోమవారం వ్యాఖ్యానించింది. తన బెయిల్‌ను హైకోర్టు నిలుపుచేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీం సోమవారం విచారణ జరిపిన సంగతి తెలిసిందే.

➡️