Kejriwal : తీహార్‌ జైలుకు కేజ్రీవాల్‌

  • 15 రోజులు జ్యుడీషియల్‌ రిమాండ్‌
  • ఢిల్లీ రౌజ్‌ అవెన్యూ కోర్టు ఆదేశం
  •  ప్రధాని చేసేది దేశానికి మంచిది కాదన్న ఆప్‌ చీఫ్‌

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్‌ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌కు 15 రోజులు జ్యుడీషియల్‌ కస్టడీ విధిస్తూ ఢిల్లీ రౌజ్‌ అవెన్యూ కోర్టు సోమవారం ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆయనను తీహార్‌ జైలుకు తరలించారు. ఆయనను జైలు నంబర్‌ 2లోని బ్యారక్‌లో పెట్టారు. అలాగే, 24 గంటలు సిసిటివి నిఘాలో ఉంచారు. సిఎం జైలుకు తరలటంతో ఆయన రోజువారీ దినచర్య మారనున్నది.
సోమవారం నాటికి కేజ్రీవాల్‌ ఈడీ కస్టడీ ముగియడంతో ఆయనను ఢిల్లీ కోర్టులోని ప్రత్యేక జడ్జి కావేరీ బవేజా ముందు ప్రవేశపెట్టారు. ఈ సమయంలో కోర్టు హాల్‌ నిండిపోయింది. కేజ్రీవాల్‌ భార్య సునీతా కేజ్రీవాల్‌తో పాటు ఆప్‌ మంత్రులు అతిషి, సౌరభ్‌ భరద్వాజ్‌లు కోర్టుకు హాజరయ్యారు. కేజ్రీవాల్‌ ‘పూర్తిగా సహకరించటం’ లేదనీ, ఆయనను 15 రోజుల జ్యుడీషియల్‌ కస్టడీకి ఇవ్వాలని ఇది.. కోర్టును కోరింది. ఇడి తరఫున అదనపు సొలిసిటర్‌ జనరల్‌ ఎస్వీ రాజు వాదనలు వినిపించారు.
ఇడి కస్టడీ పొడిగింపు కోరటం లేదనీ, ఆయనను జ్యుడీషియల్‌ కస్టడీకి అప్పగించాలని కోరారు. విచారణకు సిఎం సహకరించటంలేదనీ, ప్రశ్నలకు సమాధానం ఇవ్వటం లేదనీ, దర్యాప్తును తప్పుదారి పట్టించే యత్నం చేస్తున్నారని ఆరోపించారు. కొన్ని రోజుల తర్వాత కేజ్రీవాల్‌ను కస్టడీలోకి తీసుకుంటామనీ, అప్పటి వరకు ఆయనను జ్యుడీషియల్‌ కస్టడీకి పంపాలని ఇడి తరఫు న్యాయవాది కోర్టును కోరారు. ఇందుకు కోర్టు అంగీకరించింది. కాగా అంతకుముందు కోర్టులోకి ప్రవేశించే ముందు కేజ్రీవాల్‌ అక్కడున్న విలేకరులనుద్దేశించి మాట్లాడుతూ, ”ప్రధాని చేసేదేదైనా (తన అరెస్టుతో సహా) దేశానికి మంచిది కాదు” అని అన్నారు. ఢిల్లీ ఎక్సైజ్‌ పాలసీ మనీ లాండరింగ్‌ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి) కేజ్రీవాల్‌ను గతనెల 21న అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాతి రోజే ప్రత్యేక జడ్జి బవేజా.. ఆయనను మార్చి 28 వరకు ఇడి కస్టడీకి విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఆ తర్వాత ఇడి అభ్యర్థన మేరకు దానిని మరో నాలుగు రోజులు (ఏప్రిల్‌ 1 వరకు) పొడిగించింది. కాగా, ఈ కేసులో ఆప్‌ కీలక నేతలు మనీశ్‌ సిసోడియా, సంజరుసింగ్‌, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కె. కవితలు అరెస్టై తీహార్‌ జైలులో ఉన్న విషయం విదితమే.

➡️