మరో తొమ్మిది మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు మాతో టచ్‌లో ఉన్నారు : రెబల్‌ ఎమ్మెల్యే రాణా

Mar 2,2024 17:11 #Congress, #Himachal Pradesh

సిమ్లా : హిమాచల్‌ ప్రదేశ్‌లోని కాంగ్రెస్‌ ప్రభుత్వం రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు బిజెపి అభ్యర్థికి ఓటేశారు. దీంతో స్పీకర్‌ కుల్దీప్‌ సింగ్‌ పఠానియా ఆ ఆరుగురిపై గురువారం అనర్హత వేటు వేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజ్యసభ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థికి వ్యతిరేకంగా ఓటేసిన ఎమ్మెల్యేలు ఇప్పుడు తిరిగి రావాలనుకుంటున్నారని సీఎం సుఖ్వీందర్‌సింగ్‌ సుఖూ వ్యాఖ్యానించారు. సిఎం వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ రెబల్‌ ఎమ్మెల్యేల్లో ఒకరైన రాజీందర్‌ రాణా మండిపడ్డారు. ఆయన ఈరోజు మీడియాతో మాట్లాడుతూ.. ఃప్రజలను మభ్యపెట్టడానికి సిఎం తప్పుడు ప్రకటనలు చేస్తున్నారు. మేం కాంగ్రెస్‌లోకి తిరిగి వెళ్లాలనుకోవడం లేదు. కాంగ్రెస్‌ పార్టీ నుంచే మరో 9 మంది ఎమ్మెల్యేలు మాతో టచ్‌లో ఉన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నది కాంగ్రెస్‌ సర్కారు కాదని, సుఖూ మిత్రుల సర్కారు అని ఆయన వ్యాఖ్యానించారు.

హిమాచల్‌ ప్రదేశ్‌ ప్రజల గౌరవాన్ని నిలబెట్టడానికే మేము ఈ నిర్ణయం తీసుకున్నాము. హిమాచల్‌ప్రదేశ్‌ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించే అభ్యర్థులెవరూ రాష్ట్రం నుంచి కాంగ్రెస్‌కు లేరా? రాష్ట్ర కాంగ్రెస్‌లో ఎవరూ లేరన్నట్లుగా బయటి వ్యక్తి అయిన అభిషేక్‌ మనుసింఘ్వీని ఇక్కడ రాజ్యసభ అభ్యర్థిగా బరిలో దించారు. దాన్ని వ్యతిరేకిస్తూ మేము బిజెపి అభ్యర్థికి ఓటేశాము అని రాణా చెప్పారు. అయితే ఇక్కడి నుంచి సోనియాగాంధీని నిలబెట్టినా మీరు ఇదే పని చేసేవారా..? అని మీడియా ప్రశ్నించగా.. సోనియాగాంధీ దేశం కోసం, పార్టీ కోసం ఎంతో కృషి చేశారు. ఆమె ఇక్కడి నుంచి బరిలో దిగాల్సి వస్తే అది వేరే విషయం అని రాణా వ్యాఖ్యానించారు.

కాగా మంగళవారం హిమాచల్‌ప్రదేశ్‌లోని ఏకైక రాజ్యసభ స్థానానికి ఎన్నికలు జరగ్గా కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు విప్‌ను ధిక్కరించి బీజేపీ అభ్యర్థికి ఓటువేశారు. దాంతో సంఖ్యాబలం ఉన్న కాంగ్రెస్‌ అభ్యర్థి ఓడిపోయి బీజేపీ అభ్యర్థి గెలిచాడు. దీంతో స్పీకర్‌ ఆరుగురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశారు.

➡️