మధ్యప్రదేశ్‌లో ఘోరం – దళిత దంపతులపై దాష్టీకం

May 20,2024 08:21 #dalit case, #madyapradesh
  • దళిత దంపతులపై దాష్టీకం
  •  స్తంభానికి కట్టేసి కొట్టి, చెప్పుల దండలతో ఊరేగింపు

అశోక్‌నగర్‌ : వృద్ధులైన దళిత దంపతులపై కొందరు వ్యక్తులు దాష్టీకానికి పాల్పడ్డారు. స్తంభానికి కట్టేసి కొట్టడంతోపాటు చెప్పుల దండలు వేసి ఊరేగించిన ఘటన మధ్యప్రదేశ్‌లోని అశోక్‌నగర్‌లో చోటుచేసుకుంది. ముంగవోలి పోలీస్‌ స్టేషన్‌ ఇన్‌ఛార్జి గబ్బర్‌సింగ్‌ గుర్జార్‌ ఆదివారం తెలిపిన వివరాల ప్రకారం కిలోరా గ్రామానికి చెందిన వృద్ధ దంపతుల కొడుకు నిందితులలోని ఓ వ్యక్తి భార్యపై ఈవ్‌ టీజింగ్‌కు పాల్పడ్డాడు. ఈ ఘటన జరిగిన తరువాత ఆ కుటుంబం గ్రామం నుంచి వెళ్లిపోయింది. దళిత దంపతులిద్దరూ గ్రామానికి ఇటీవల వచ్చారు. ఈ విషయం తెలిసిన నిందితులు శుక్రవారం ఒక్కసారిగా వారిపై దాడికి పాల్పడ్డారు. 65 ఏళ్ల వృద్ధుడు, 60 ఏళ్ల మహిళ అన్న కనికరం కూడా లేకుండా వారిద్దరినీ స్తంభానికి కట్టేసి కొట్టారు. ఆ తరువాత చెప్పుల దండలు వేసి ఊరేగించారు. బాధిత మహిళ ఫిర్యాదు మేరకు 10 మంది నిందితులపై శనివారం ఎస్‌సి, ఎస్‌టి అత్యాచారాల నిరోదక చట్టంలోని సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేసినట్లు గబ్బర్‌సింగ్‌ తెలిపారు. నిందితులు పరారీలో ఉన్నారని, వారి కోసం గాలింపు చర్యలు చేపట్టామని చెప్పారు.

➡️