బడా పరిశ్రమలకే బ్యాంక్‌ రుణాల మాఫీ

Dec 6,2023 10:54 #bank loans, #Lok Sabha

 

లోక్‌సభకు తెలిపిన కేంద్రం

న్యూఢిల్లీ : గత ఐదు సంవత్సరాల కాలంలో బ్యాంకులు రూ.10.6 లక్షల కోట్ల మేర రుణాలు మాఫీ చేశాయి. అయితే వీటిలో సగానికి పైగా బడా పరిశ్రమలు, సేవల రంగానికి సంబంధించిన రుణాలే ఉన్నాయి. 2022-23 ఆర్థిక సంవత్సరంలో వాణిజ్య బ్యాంకులు రూ.2.09 లక్షల కోట్ల మేరకు రుణాలను మాఫీ చేశాయి. ఇందులో 52.3% లేదా రూ.1.9 కోట్లు బడా పరిశ్రమలు, సేవల రంగానివేనని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్‌ కరద్‌ లోక్‌సభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో తెలియజేశారు. బ్యాంకుల నుండి రూ.5 కోట్లు, ఆ పైన రుణాలు తీసుకున్న 2,300 మంది రెండు లక్షల కోట్ల రూపాయల మేర బకాయి పడ్డారని కూడా ఆయన చెప్పారు. రుణాలు ఎగవేసిన కార్పొరేట్‌ సంస్థల పేర్లు వెల్లడించాలంటూ సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ రుణమాఫీ చేసిన కంపెనీల పేర్లు బయటపెట్టకూడదని ఆర్‌బీఐ నిబంధనలు నిర్దేశిస్తున్నాయని తెలిపారు. రుణాల చెల్లింపులో జాప్యం చేసిన వారి నుండి బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు వసూలు చేసిన జరిమానా ఛార్జీల వివరాలు తెలపాలని కోరగా ఆ వివరాలు తన వద్ద లేవని ఆర్‌బీఐ చెప్పిందని వివరించారు. అయితే గడచిన ఆర్థిక సంవత్సరంలో పెనాల్టీలు సహా ఇతర ఛార్జీల రూపంలో బ్యాంకులు రూ.5,309.80 కోట్లు వసూలు చేశాయని ఆర్‌బీఐ సమాచారాన్ని ఉటంకిస్తూ మంత్రి తెలియజేశారు. కాగా సమాచార హక్కు చట్టం ద్వారా సేకరించిన వివరాల ప్రకారం ఆర్‌బీఐ సమాచారం మేరకు 2012-13 నుండి బ్యాంకులు రూ.15,31,453 కోట్ల రూపాయల రుణాలను మాఫీ చేశాయని ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ పత్రిక తెలిపింది. గత మూడు సంవత్సరాల కాలంలో బ్యాంకులు రూ.5.87 లక్షల కోట్ల రుణాలు మాఫీ చేయగా అందులో కేవలం రూ.1.09 లక్షల కోట్లు మాత్రమే రాబట్టగలిగాయి. అంటే రద్దు చేసిన రుణాలలో ఇది 18.60% అన్న మాట. పన్ను ఎగవేతదారులతో రాజీ కుదుర్చుకోవాలని ఆర్‌బీఐ చేసిన సూచనను బ్యాంకులు వ్యతిరేకించాయి.నేడు ‘ఇండియా’ ఫోరం సభాపక్ష నేతల భేటీ న్యూఢిల్లీ : బిజెపియేతర ప్రతిపక్షాల ఐక్య వేదిక ‘ఇండియా’ ఫోరం అధినేతల సమావేశం డిసెంబరు మూడో వారానికి వాయిదా పడింది. ఇదివరకు ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఈ నెల 6న బుధవారం నాడు కాంగ్రెస్‌ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే నివాసంలో ఈ సమావేశం జరగాల్సివుంది. అయితే ‘ఇండియా’ ఫోరంలోని పక్షాలకు సంబంధించిన పార్లమెంటరీ పార్టీ నేతలు బుధవారం సాయంత్రం 6 గంటలకు ఖర్గే నివాసంలో సమావేశమవుతారు. ఆ తర్వాత ఫోరంలోని పార్టీ అధ్యక్షులు, అధినేతల సమావేశం డిసెంబరు మూడో వారంలో నిర్వహించనున్నట్లు ఖర్గే కార్యాలయ సమన్వయకర్త గురుదీప్‌ సప్పాల్‌ ట్విట్టర్‌లో పోస్టు చేశారు. సమావేశ తేదీని నేతలందరికీ అనువైన సమయాన్ని చూసి నిర్ణయించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇదివరకే ఖరారు అయిన షెడ్యూల్‌కు సమయం కేటాయించినందున బుధవారం సమావేశానికి తాము హాజరుకాలేమని టిఎంసి అధ్యక్షులు మమతా బెనర్జీ ప్రకటించడం.. ఎస్‌పి అధ్యక్షులు అఖిలేష్‌ యాదవ్‌కు తమకు సమాచారం లేదని..హాజరయ్యేది లేనిది నిర్ణయించలేదని పేర్కొన్నారు. అలాగే తుపాను కారణంగా తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్‌, అనారోగ్య కారణాల రీత్యా బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌ కూడా బుధవారం నాటికి హాజరు కాలేమని తెలిపారు. ఈ నేపథ్యంలో ఫోరం అగ్రనేతల సమావేశాన్ని వాయిదా వేయడం అనివార్యమైనట్లు తెలుస్తోంది.

➡️