రాజ్యసభ ఎన్నికల్లో భారీగా బేరసారాలు

Feb 28,2024 09:45 #Bargaining, #Rajya Sabha elections
  • హిమాచల్‌, యుపిలో బిజెపి మార్కు అక్రమాలు
  • అదనపు సీట్ల కోసం అడ్డదారులు
  • క్రాస్‌ఓటింగ్‌తో హిమాచల్‌లో కాంగ్రెస్‌కు ఓటమి
  • కర్ణాటకలో బిజెపికి ఇద్దరు ఎమ్మెల్యేల ఝలక్‌

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : పార్లమెంటులోపల, వెలుపల ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న బిజెపి చివరికి రాజ్యసభ ఎన్నికలను కూడా ప్రహసనంగా మార్చేసింది. మూడు రాష్ట్రాల్లోని 15 రాజ్యసభ స్థానాలకు మంగళవారం జరిగిన ఎన్నికల్లో బిజెపి ఇతర పార్టీల ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం, బెదిరించి లొంగదీసుకోవడం, సిఆర్‌పిఎఫ్‌ కాన్వారుతో ఎమ్మెల్యేలను కిడ్నాపు చేయడం వంటి నీతిబాహ్యమైన పద్దతుల్లో హిమాచల్‌, యుపిలో కొన్ని సీట్లు అదనంగా తన ఖాతాలో వేసుకుంది.ఉత్తరప్రదేశ్‌లో పది, కర్ణాటకలో నాలుగు, హిమాచల్‌ప్రదేశ్‌లో ఒక స్థానానికి ఎన్నికలు నిర్వహించగా, బిజెపి -10, కాంగ్రెస్‌-4, సమాజ్‌వాది పార్టీ -2 స్థానాలు గెలుచుకున్నాయి. కర్ణాటకలో బిజెపి పప్పులుడకలేదు. అక్కడ ఇద్దరు ఎమ్మెల్యేలు బిజెపికి ఝలక్‌ ఇచ్చారు. ఒకరు కాంగ్రెస్‌ అభ్యర్థి అజరు మాకెన్‌కు మద్దతుగా ఓటు చేయగా, మరొకరు ఓటింగ్‌కు గైర్హాజరయ్యారు. దీంతో ఈ రాష్ట్రంలోని నాలుగు స్థానాలకుగాను మూడింటిని కాంగ్రెస్‌ గెలుచుకుంది. బిజెపికి ఒక్క స్థానమే దక్కింది. మూడో స్థానాన్ని కాంగ్రెస్‌ గెలవకుండా చేయాలని బిజెపి, జెడిఎస్‌ పన్నిన కుయుక్తులు బెడిసికొట్టాయి. హిమాచల్‌ప్రదేశ్‌లోని ఏకైక స్థానం వాస్తవానికి కాంగ్రెస్‌కు దక్కాలి. కానీ, ఆరుగురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను, ముగ్గురు ఇండిపెండెంట్‌ ఎమ్మెల్యేలను సిఆర్‌పిఎఫ్‌ సాయంతో కిడ్నాపు చేయడం ద్వారా బిజెపి ఆ సీటును లాగేసుకుంది. ఉత్తరప్రదేశ్‌లో పది స్థానాలకు గాను బిజెపి ఎనిమిది, ఎస్‌పి రెండు స్థానాలను కైవసం చేసుకున్నాయి.

ఈ ఏడాది ఏప్రిల్‌ 2 నాటికి 52 మంది సభ్యుల పదవీ విరమణ చేస్తుండడంతో ఆ ఖాళీలకు ఎన్నిక అవసరమైంది. వీటిలో 12 రాష్ట్రాల్లో 41 స్థానాలకు ఎన్నిక ఏకగ్రీవమైంది. అందులో ఎపిలో మూడు, తెలంగాణలో మూడు స్థానాలు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌లో ఎనిమిదో సీటు గెలుచుకునేంత బలం బిజెపి లేకపోయినప్పటికీ, ప్రత్యర్థి ఎమ్మెల్యేలను కొందరిని కొనుగోలు చేయడం ద్వారా ఆ స్థానాన్ని చేజిక్కించుకుంది. ఏడుగురు సమాజ్‌ వాదీ పార్టీ ఎమ్మెల్యేలు, ఒక ఎస్‌బిఎస్‌పి ఎమ్మెల్యే, ఒక బిఎస్‌పి ఎమ్మెల్యే బిజెపికి క్రాస్‌ ఓటింగ్‌ చేశారు. రాజ్యసభ ఎన్నికల్లో కాషాయ పార్టీ అక్రమాలకు తెరలేపిందని ఎస్‌పి అధ్యక్షులు అఖిలేష్‌ యాదవ్‌ విమర్శించారు. పెద్దల సభకు జరిగే ఎన్నికలను కాషాయ పార్టీ అక్రమాలకు పాల్పడడం అత్యంత శోచనీయమని అన్నారు.

హిమాచల్‌లో ఒక్క స్థానం బిజెపికే

                 హిమాచల్‌ప్రదేశ్‌ నుండి రాజ్యసభ స్థానానికి బిజెపి అభ్యర్థి హర్ష్‌ మహాజన్‌ గెలిచారు. కాంగ్రెస్‌ అభ్యర్థి అభిషేక్‌ మను సింఘ్వీకి, బిజెపి అభ్యర్థి హర్ష్‌ మహాజన్‌లకు ఒక్కొక్కరికి 34 ఓట్లు పోలయ్యాయి. దీంతో ‘టాస్‌’ ఆధారంగా గెలుపును నిర్ణయించారు. ఈ ‘డ్రా’లో బిజెపి అభ్యర్థి హర్ష్‌ మహాజన్‌ను గెలుపు వరించింది. అధికార కాంగ్రెస్‌ పార్టీకి 40 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ ఆరుగురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు క్రాస్‌ ఓటింగ్‌ చేయడంతో కాంగ్రెస్‌ అభ్యర్థి అభిషేక్‌ మను సింఘ్వీ ఓటమి పాలయ్యారు.. ఆరుగురు కాంగ్రెస్‌, ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలను సిఆర్‌పిఎఫ్‌ ఎస్కార్ట్‌ సహాయంతో హర్యానాకు బిజెపి తరలించి హిమాచల్‌ప్రదేశ్‌ సిఎం సుఖ్విందర్‌ సింగ్‌ సుఖు విమర్శించారు.

➡️