భారత్‌ జోడో న్యాయ్ యాత్ర ప్రారంభం

Jan 15,2024 10:53 #Begins, #Bharat, #Jodo Nyay Yatra
  • మోడీపై రాహుల్‌, ఖర్గే విమర్శలు

తౌబాల్‌ : మణిపూర్‌లోని తౌబాల్‌లో ఆదివారం భారత్‌ జోడో న్యారు యాత్రను కాంగ్రెస్‌ ప్రారంభించింది. కాంగ్రెస్‌ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, నాయకులు రాహుల్‌ గాంధీ భారత జెండాను ఊపి ఈ యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా తౌబాల్‌లో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై ఖర్గే, రాహుల్‌ గాంధీ విమర్శలు గుప్పించారు. మణిపూర్‌లో రాష్ట్ర ప్రభుత్వం దారుణంగా విఫలమైందని రాహుల్‌ విమర్శించారు. మణిపూర్‌ను భారతదేశంలో ఒక భాగంగా మోడీ, బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌లు భావించడం లేదని ఆరోపించారు. ‘మణిపూర్‌లో కొన్ని నెలలుగా హింసాకాండ చెలరేగుతోంది. లక్షలాది మంది ప్రజలు కష్టాలు అనుభవిస్తున్నారు. కానీ మీ కన్నీళ్లు తుడవడానికి, మీ చేయి పట్టుకోవడానికి ప్రధానమంత్రి మోడీ ఇక్కడకు రాలేదు. బహుశా మోడీకి, బిజెపికి, ఆర్‌ఎస్‌ఎస్‌కు మణిపూర్‌ భారత దేశంలో భాగం కాదేమో’ అని రాహుల్‌గాంధీ వ్యంగ్యంగా విమర్శించారు. ‘మణిపూర్‌ ప్రజల బాధను అర్థం చేసుకున్నాం. ఈ రాష్ట్రానికి సామరస్యాన్ని, శాంతి, ఆప్యాయతలను తిరిగి తీసుకుని వస్తాం’ అని రాహుల్‌ గాంధీ హామీ ఇచ్చారు.

ఖర్గే మాట్లాడుతూ ‘ఓట్లు అడగడానికి మాత్రమే ప్రధాని మోడీ ఈ రాష్ట్రానికి వచ్చారు. అంతేకానీ రాష్ట్ర ప్రజలు బాధలో ఉన్నప్పుడు దుఖాన్ని పంచుకోవడానికి మాత్రం రాలేదు’ అని మోడీని విమర్శించారు. ‘మోడీకి సముద్రం వద్ద నడవడానికి, సముద్రంలో స్నానం చేయడానికి సమయం ఉంది. కానీ మణిపూర్‌కు రావడానికి లేదు. మోడీ ‘రామ్‌, రామ్‌’ అని జపిస్తూ ఉంటారు. కానీ ఓట్ల కోసం అలా చేయడం తగదు. మతాన్ని, రాజకీయాలను బిజెపి మిళితం చేస్తుంది. ప్రజలను రెచ్చగొడుతుంది’ అని ఖర్గే ఆరోపించారు. సామాజిక న్యాయం, లౌకిక వాదం, సమానత్వానికి కాంగ్రెస్‌ అండగా ఉంటుందని ఖర్గే హామీ ఇచ్చారు. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకు.. ఫాసిస్టు శక్తులు వ్యతిరేకంగా పోరాడేందుకు రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో న్యాయ్ యాత్ర చేపడుతున్నారని ఖర్గే తెలిపారు.

కాగా, ఆదివారం ఉదయం ముందుగా ఇంఫాల్‌ విమానాశ్రయానికి చేరుకున్న రాహుల్‌ గాంధీకి కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి రాహుల్‌ నేరుగా ‘ఖోంగ్‌జోమ్‌ యుద్ధ స్మారకం’ వద్దకు వెళ్లారు. అక్కడ 1891 ఆంగ్లో- మణిపుర్‌ యుద్ధంలో అమరులకు నివాళులర్పించారు. అక్కడనుంచి ‘న్యారు మైదాన్‌’కు చేరుకున్నారు. మణిపుర్‌ నుంచి ముంబయి వరకు సాగే ‘భారత్‌ జోడో న్యారు యాత్ర’ ప్రారంభించారు. ఈ యాత్ర మొత్తం 110 జిల్లాలు, 100 లోక్‌సభ స్థానాలు, 337 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా 67 రోజుల పాటు 6,713 కిలోమీటర్ల మేర కొనసాగనుంది. మార్చి 20 లేదా 21 తేదీల్లో ముంబయిలో ముగుస్తుంది.

➡️