అద్వానీకి భారతరత్నప్రధాని అభినందనలు

న్యూఢిల్లీ : బిజెపి అగ్రనేత ఎల్‌కె అద్వానీకి ప్రతిష్టాత్మక భారతరత్న అవార్డును కేంద్రప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్రపతి భవన్‌ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ విషయాన్ని ఎక్స్‌ వేదికగా ప్రధాని నరేంద్రమోడీ శనివారం ప్రకటించారు. ”అద్వానీకి భారతరత్న దక్కడం సంతోషంగా ఉంది. ఆయనతో మాట్లాడి నేనూ అభినందనలు తెలిపాను. మన కాలంలో అత్యంత రాజనీతిజ్ఞుల్లో ఆయన ఒకరు. అట్టడుగు స్థాయి నుంచి ఉప ప్రధాని వరకు దేశాభివృద్ధిలో ఆయన పాత్ర కీలకం” అని పేర్కొన్నారు. మనదేశంలో అత్యున్నత పౌర పురస్కారమైన భారత రత్నను తొలిసారిగా 1954లో ప్రదానం చేశారు. బాబ్రీ మసీదు స్థలంలో రాముడి ఆలయాన్ని నిర్మించాలంటూ అద్వానీ రథయాత్ర నిర్వహించారు. రథయాత్ర దేశవ్యాప్తంగా మత సమీకరణలకు, ఉద్రిక్తతలకు దారితీసింది. సుమారు రెండు వేల మంది ప్రాణాలు కోల్పోయారు. బాబ్రీ మసీదు కూల్చివేతకు దారితీసింది. 1927 నవంబర్‌ 8న ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఉన్న కరాచీలో లాల్‌ కృష్ణ అద్వానీ జన్మించారు. 14 ఏళ్లకే ఆర్‌ఎస్‌ఎస్‌లో చేరిన ఆయన పాక్‌లోని హైదరాబాద్‌ డిజి నేషనల్‌ కాలేజిలో న్యాయవిద్య పూర్తి చేశారు. 1977-80లో జనతా పార్టీ ప్రధాన కార్యదర్శిగానూ, 1977-79 మధ్య సమాచార, ప్రసార శాఖ మంత్రిగానూ పనిచేశారు. 1980లో వాజ్‌పేయితో కలిసి బిజెపిని స్థాపించారు. 1998 నుంచి 2002 వరకూ కేంద్ర హోం మంత్రిగానూ, 2002 నుంచి 2004 వరకూ ఉప ప్రధానిగానూ బాధ్యతలు నిర్వహించారు. 2004 నుంచి 2014 వరకూ ప్రతిపక్ష నేతగా కొనసాగారు. మూడుసార్లు రాజ్యసభ సభ్యుడిగానూ, మూడుసార్లు లోక్‌సభ సభ్యుడిగానూ ఎన్నికయ్యారు. 2019 నుంచి క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నారు. 2015లో ఆయనకు కేంద్రం పద్మవిభూషణ్‌ అవార్డును ప్రదానం చేసింది. ఇప్పటివరకూ ఆర్‌ఎస్‌ఎస్‌ నుంచి వచ్చిన నలుగురికి దేశ అత్యున్నత పురస్కారమైన భారతరత్నను మోడీ ప్రభుత్వం అందజేసింది. అద్వానీతోపాటు మాజీ ప్రధాని వాజ్‌పేయి, పండిట్‌ మదన్‌ మోహన్‌ మాలవ్య, నానాజీ దేశ్‌ముఖ్‌లకు భారతరత్న అవార్డులను ప్రదానం చేసింది.

➡️